PM Internship Scheme 2025: కేంద్రం గుడ్‌న్యూస్.. మళ్లీ పీఎం ఇంటర్న్‌షిప్ వచ్చేసింది!
PM Internship Scheme 2025: డిసెంబర్‌లో ఈ పథకం ప్రారంభించిన తర్వాత భాగస్వామ్య కంపెనీలు 60,866 మంది అభ్యర్థులకు 82,077 ఇంటర్న్‌షిప్‌లను అందించాయని, అందులో 28,000 మందికి పైగా అభ్యర్థులు ఆఫర్‌లను అంగీకరించారని మంత్రి తెలిపారు. ఇప్పుడు రెండో విడతకు కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..

యువతకు గుడ్‌న్యూస్ తెలిపింది కేంద్ర ప్రభుత్వం. కొత్త నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PM Internship Scheme) రెండో విడతకు కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాల కోసం మార్చి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ రెండవ దశలో భారతదేశంలోని 730 కి పైగా జిల్లాల్లోని అగ్రశ్రేణి కంపెనీలలో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
మొదటి రౌండ్‌లో 6 లక్షలకు పైగా దరఖాస్తులకు భారీ స్పందన వచ్చిన తర్వాత, ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) తన రెండవ రౌండ్‌ను ప్రారంభించింది. ఇది 1 లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌లను అందిస్తోంది. ఈ పథకం ఔత్సాహిక యువ నిపుణులను చమురు అండ్ గ్యాస్, బ్యాంకింగ్, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, తయారీ, FMCGతో సహా విభిన్న రంగాలలోని ప్రముఖ కంపెనీలలో 12 నెలల ఇంటర్న్‌షిప్‌లతో చేయడానికి ప్రోత్సాహం అందిస్తుంది.
ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5,000 చొప్పున ఏడాది పాటు అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగే కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్‌టైం గ్రాంట్) కూడా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.66,000 పొందుతారు. ఈ స్కీమ్‌లో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అందిస్తాయి.
దేశంలోని 730 జిల్లాల్లో 300కి పైగా అగ్రశ్రేణి కంపెనీలు పాల్గొంటున్నాయి. దరఖాస్తుదారులు స్థానం, రంగం, ఆసక్తి ఉన్న ప్రాంతం ఆధారంగా ఇంటర్న్‌షిప్‌లను ఎంచుకోవచ్చు. సౌలభ్యం కోసం వారి ప్రస్తుత చిరునామా నుండి ఏ ప్రాంతంలో పని చేయాలి అనుకుంటున్నారో కూడా పేర్కొనవచ్చు. ఈ రౌండ్‌లో, ప్రతి అభ్యర్థి గడువుకు ముందు గరిష్టంగా 3 ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ONGCలో 6000 ఇంటర్న్‌షిప్ పోస్టులు:
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఆఫ్‌షోర్ రిగ్‌లు, డ్రిల్లింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కీలకమైన సాంకేతిక పాత్రలను అవుట్‌సోర్స్ చేయాలని యోచిస్తోంది. ఆ కంపెనీ 6000 ఇంటర్న్‌షిప్ పోస్టులకు నియామకాలు చేపడుతుంది.
ఇంటర్న్‌షిప్‌లో మీకు ఎంత డబ్బు వస్తుంది?
ఈ పథకం కింద ప్రతి శిక్షణార్థికి నెలవారీగా రూ.5,000 ఆర్థిక సహాయంతో పాటు రూ. 6,000 ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తారు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు మాట్లాడుతూ, ఈ పథకం లక్ష్యం ఉద్యోగాలు కల్పించడం కాదని, ఇంటర్న్‌షిప్ ద్వారా అనుభవాన్ని అందించడం, అందుకు తగినట్లు శిక్షణ ఇవ్వాలనే దాని గురించి అవగాహన కల్పించడం అని అన్నారు.
ఈ పథకం కింద ఇప్పటివరకు 28,141 మంది అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ఇటీవల లోక్‌సభకు తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన పైలట్ ప్రాజెక్ట్ మొదటి రౌండ్‌లో దేశవ్యాప్తంగా పాల్గొనే కంపెనీలు అందించే 127,000 ఇంటర్న్‌షిప్ అవకాశాల కోసం అభ్యర్థుల నుండి 621,000 దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు.
ఏ కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ను అందించాయి?
డిసెంబర్‌లో ఈ పథకం ప్రారంభించిన తర్వాత భాగస్వామ్య కంపెనీలు 60,866 మంది అభ్యర్థులకు 82,077 ఇంటర్న్‌షిప్‌లను అందించాయని, అందులో 28,000 మందికి పైగా అభ్యర్థులు ఆఫర్‌లను అంగీకరించారని మంత్రి తెలిపారు. పైలట్ దశలో మొదటి రౌండ్‌లో IOCL, ONGC, వేదాంత, మారుతి సుజుకి, టైటాన్, NTPC వంటి కంపెనీలు 656 జిల్లాల్లో ఇంటర్న్‌షిప్‌లను అందించాయి.
PM ఇంటర్న్‌షిప్ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?
- ఇంటర్న్‌షిప్ పథకం వెబ్‌సైట్ చిరునామా: pminternship.mca.gov.in/login/
- ఇక్కడ లాగిన్ అయిన తర్వాత, రిజిస్టర్‌పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, పూర్తి చేసేందుకు క్లిక్ చేయండి. ఇలా అక్కడ అడిగే వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




