King Chilli: దెయ్యం మిర్చి.. తిన్నారంటే.. నేలపై పడి దొర్లాల్సిందే.. ఆసక్తికర విషయాలు

మిర్చి.. !! ఈ పేరెత్తితే.. ఠక్కున గుర్తుకు వచ్చేంది గుంటూరు మిర్చి..!! రంగు, రుచి, ఘాటులో.. గుంటూరు మిర్చికి మరే మిరప సరితూగదంటారు. గుంటూరు మిర్చికి దేశంలోనే కాదు..

King Chilli: దెయ్యం మిర్చి.. తిన్నారంటే.. నేలపై పడి దొర్లాల్సిందే.. ఆసక్తికర విషయాలు
Nagaland Mirchi
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 06, 2021 | 8:56 PM

మిర్చి.. !! ఈ పేరెత్తితే.. ఠక్కున గుర్తుకు వచ్చేంది గుంటూరు మిర్చి..!! రంగు, రుచి, ఘాటులో.. గుంటూరు మిర్చికి మరే మిరప సరితూగదంటారు. గుంటూరు మిర్చికి దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ గుర్తింపు ఉంది. గుంటూరు మిర్చి దేశాలు దాటి ఎగుమతి అవుతోంది. అయితే.. గుంటూరు మిర్చిని… మించిన అత్యంత ఘాటైన మిర్చి తెరపైకి వచ్చింది. అదే..నాగాలాండ్‌ మిర్చి.  మీకు ఇప్పుడు దెయ్యం మిర్చిని పరిచయం చేయబోతున్నాం. ప్రపంచంలోనే.. అత్యంత ఘాటైన ఐదు మిర్చీల్లో ఇదీ ఒకటి. ఈ మిర్చీతో తయారు చేసిన వంటలు కానీ తిన్నారంటే.. దెయ్యం పట్టినట్లుగా.. నేలపై పడి దొర్లాల్సిందే. కడుపు, ఛాతీలో విపరీతమైన మంటలో.. అల్లాడాల్సిందే. ఈ ఘాటు మిర్చేనే ఇప్పుడు.. ఇండియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈశాన్య భారత్‌లో పండే మిర్చీల్లో.. భూత్ జోలోకియా ఒకటి. ఈ మిర్చీకి ఎన్నో పేర్లు ఉన్నాయి. కింగ్ మిర్చి, రాజా మిర్చి, నాగా మిర్చి, గోస్ట్ పెప్పర్ అని కూడా పిలుస్తుంటారు. విపరీతమైన ఘాటుగా ఉండటం వల్లే దీనికి కింగ్ మిర్చి అని పేరు వచ్చింది. అంటే.. భారత్‌లోని మిర్చీలకు ఇది రాజు అని అర్థం. నాగాలాండ్‌లో ఎక్కువగా పండుతుందని కాబట్టి, దీనికి నాగా మిర్చి అనే పేరు వచ్చింది. 2007లో ఈ భూత్ జలోకియా మిర్చిని అత్యంత ఘాటైన మిర్చిగా గిన్నెస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తించింది. దేశంలోనే.. అత్యంత ఘాటైన ఈ నాగా మిర్చి… ఇప్పుడు తొలిసారిగా భారత్‌… బ్రిటన్‌కు ఎగుమతి చేసింది. నాగాలాండ్ నుంచి లండన్‌కు గత బుధవారం తొలి పార్సిల్ వెళ్లింది. ఇదివరకు ఈ మిర్చీల పౌడర్‌ను మాత్రమే ఎగుమతి చేసేవారు. ఇప్పుడు మిరపకాయలను ఎగుమతి చేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ‘‘ఈ మిర్చి తిన్నవారికి మాత్రమే.. దీని ఘాటు ఏంటో తెలుస్తుంది’’అని మోదీ ట్వీట్ చేశారు.

రాజా మిర్చి నాలుగు నుంచి ఐదు అంగుళాల పొడవు ఉంటుంది. ఆకుపచ్చ రంగుతోపాటు ఎరుపు, చాక్లెట్ రంగుల్లోనూ ఇవి కనిపిస్తాయి. ముఖ్యంగా ఆహారంలో ఘాటు పెంచేందుకు, ఊరగాయల్లో వీటిని ఉపయోగిస్తుంటారు. వీటితో తయారుచేసే మాంసాహారం చాలా రుచిగా ఉంటుందట. వీటితో సాస్‌లు కూడా తయారుచేస్తుంటారు. భారత మార్కెట్లలో వీటి ధర కేజీ రూ.300 వరకు ఉంటుంది. లండన్ మార్కెట్‌లో అయితే వీటి ధర కేజీ రూ.600. ప్రస్తుతం నాగాలాండ్, అస్సాంలలో వీటిని పండిస్తున్నారు. ఒక్కసారి ఎగుమతులు వేగం పుంజుకుంటే, భారీగా వీటిని సాగు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక వ్యవసాయశాఖ అధికారులు.

మిర్చి ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అంతేకాదు వినియోగంలోనూ భారత్‌దే మొదటి స్థానం. భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో మిర్చి ఏడాది పొడవునా పండుతుంది. దీని సాగుకు 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరం. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు.. తదితర రాష్ట్రాలు మిర్చి పంటలతో ప్రఖ్యాతి గాంచాయి. ప్రస్తుతం ఈ జాబితాలో నాగాలాండ్, అస్సాం కూడా చేరుతున్నాయి. మరోవైపు.. ఈ నాగాలాండ్‌ మిర్చిని ఉపయోగించి.. భారత రక్షణ, అభివృద్ధి పరిశోధన సంస్థ డీఆర్‌డీవో.. హ్యాండ్‌ గ్రెనేడ్లను తయారు చేసింది. 2015లో ఉగ్రవాదుల స్థావరాలపై.. చిల్లీ గ్రెనేడ్లను భారత సైన్యం ఉపయోగించింది. ఇంతటి ఘాటైన మిర్చి కాబట్టే.. ప్రపంచ దేశాలు.. మిర్చిలందు నాగాలాండ్‌ మిర్చి ఘాటే వేరయా అంటున్నాయి.

Also Read:పైనుంచి చూస్తే పక్కా పైనాపిల్ లోడే అనుకుంటారు.. లోపల చెక్ చేస్తే మైండ్ బ్లాంక్

 కరోనాతో ఎస్సార్ నగర్ పీఎస్‌ హోంగార్డు మృతి.. పోలీసు శాఖలో కలవరం