Karnataka VHP: కర్నాటకలో మరో మసీదు వివాదం.. శ్రీరంగపట్నంలో హిందూసంఘాలు భారీ ఆందోళనలు..
Karnataka VHP: కర్నాటకలో మసీదుల వివాదం మళ్లీ రాజుకుంది. కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం మరవక ముందే.. రాష్ట్రంలో కూడా అలాంటి వివాదమే రాజుకుంది.
Karnataka VHP: కర్నాటకలో మసీదుల వివాదం మళ్లీ రాజుకుంది. కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం మరవక ముందే.. రాష్ట్రంలో కూడా అలాంటి వివాదమే రాజుకుంది. శ్రీరంగపట్నంలో ఆలయాన్ని కూల్చేసి మసీదు కట్టారని హిందూసంఘాలు ఆందోళన చేపట్టాయి. మాండ్య జిల్లా శ్రీరంగపట్నంలో వీహెచ్‌పీతో పాటు భజరంగ్‌దళ్ కార్యకర్తలు భారీ ఆందోళనలు చేపట్టారు. హిందూ ఆలయాలను కూలగొట్టి మసీదులను కట్టారని ఆరోపిస్తూ హిందూ సంస్థలు మసీదుల ముందు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
శ్రీరంగపట్నంలోని జామియా మసీదు దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్‌కు చెందిన కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులను వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు. మసీదు వెలుపల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ఐదు కర్నాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ ప్లాటూన్లు, ఇతర భద్రతా బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. మాండ్యాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. మాండ్యాలో సెక్షన్ 144 విధించారు. ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించరాదని పోలీసులు ఆదేశించారు.
అయితే మరోసారి కూడా జామియా మసీదు ముందు ఆందోళనలు నిర్వహిస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి. దీంతో శ్రీరంగపట్నంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా ఉండేందుకు పోలీసులు మాత్రం భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే వారణాసిలోని మసీదు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు శ్రీరంగపట్నంలోని జామియా మసీదును తెరమీదకి తీసుకొచ్చారు వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.