Karnataka: కర్ణాటకలో కొత్త కేబినెట్.. 29 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
కర్ణాటకలో బుధవారం సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వాన కొత్త కేబినెట్ ఏర్పాటైంది. 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
కర్ణాటకలో బుధవారం సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వాన కొత్త కేబినెట్ ఏర్పాటైంది. 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కార్జోల్, మాజీ మంత్రి ఈశ్వరప్ప, బి.శ్రీరాములు, ఆర్. అశోకా తదితరులు వీరిలో ఉన్నారు. మంత్రివర్గంలో ఏడుగురు బీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఏడుగురు ఒక్కళిగులు, ఒకరు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు ఉన్నారని అంతకుముందు బొమ్మై చెప్పారు.
ఒక మహిళకు కూడా కేబినెట్ లో స్థానం కల్పించామన్నారు. గతంలో మాదిరి ఈ సారి డిప్యూటీ సీఎం లు ఉండరని స్పష్టం చేశారు. లోగడ మాజీ సీఎం ఏదియూరప్ప మంత్రివర్గంలో ముగ్గురు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉండేవారని, కానీ ఈ సారి పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ పదవుల్లో ఎవరినీ తీసుకోలేదని ఆయన వెల్లడించారు. యెడియూరప్ప కుమారుడు విజయేంద్రకు తదుపరి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కవచ్చునని తెలుస్తోంది. ఆయన విషయమై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని బొమ్మై పేర్కొన్నారు.
గత జులై 30 న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన బొమ్మై మళ్ళీ నిన్న హస్తిన చేరుకొని పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారు. మొత్తం 29 మంది మంత్రుల జాబితాతో బుధవారం బెంగుళూరు చేరుకున్నారు. కర్ణాటక మంత్రివర్గ విస్తరణ మళ్ళీ త్వరలో ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తాను మొదటి ప్రాధాన్యమిస్తామని బొమ్మై పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Bangladesh: బంగ్లాదేశ్ లో ‘పిడుగుల వర్షం’.. పెళ్లి బృందంలో 16 మంది మృతి.. వరుడికి గాయాలు
పెగాసస్ పై మళ్ళీ రభస.. రాజ్యసభ నుంచి ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్