Viral: ఓర్నీ.. పాడుబడ్డ బావిలో బంగారం.. ఏకంగా కేజీల్లో.. ఎలా బయటపడిందంటే..?
కర్ణాటక దావణగెరెలోని హై ప్రొఫైల్ న్యామతి ఎస్బీఐ బ్యాంకు దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు రూ.13 కోట్ల విలువైన దొంగిలించబడిన బంగారాన్ని రికవరీ చేశారు. 2024 అక్టోబర్‌లో జరిగిన ఈ దోపిడీలో దాదాపు 17.7 కిలోల బరువున్న తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల దొంగతనం జరిగింది. దావణగెరె జిల్లా పోలీసులు ఐదు నెలల పాటు తీవ్రంగా దర్యాప్తు చేసిన అనంతరం.. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో న్యామతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో దుండగులు చొరబడి బంగారాన్ని దోచుకున్నారు. దొంగలు కిటికీ ఫ్రేమ్‌ను పగులగొట్టి లోపలికి ప్రవేశించి దాదాపు 13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. ఈ దోపిడి 2024 అక్టోబర్‌లో జరిగింది. కట్ చేస్తే ఆరు నెలల తరువాత ఆ బంగారం ఓ బావిలో బయటపడింది. అప్పటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. లోన్ కోసం వచ్చిన ఓ వ్యక్తికి ఆగస్టు 2023లో లోన్ రిజెక్ట్ చేశారు సదరు ఎస్‌బీఐ బ్రాంచ్ సిబ్బంది. రూ. 15 లక్షల రుణం కోసం పదే పదే అడిగినా బ్యాంక్ అధికారులు లోన్ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు.. అంతే బ్యాంక్‌పై పగబట్టాడు.. ఏదొకటి చేయాలని డిసైడ్ అయ్యాడు. తన ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి చాలా జాగ్రత్తగా ఈ దోపిడీకి పథకం వేశాడు.
ఈ క్రమంలో ఆ వ్యక్తి ఓ గ్యాంగ్‌ని ఏర్పాటు చేసి అదే బ్యాంక్‌కి కన్నం వేసి లాకర్‌లో ఉన్న తాకట్టు బంగారం అంతా మూట కట్టి తీసుకెళ్లారు. పోలీసులకు చిక్కకుండా.. సీసీటీవీ ఫుటేజ్ ఉన్న బ్యాంకు డీవీఆర్‌ను తీసుకెళ్లి పోయారు. దీంతో నిందితులను గుర్తించడం కష్టతరం అయింది.
ఆ మూట తీసుకెళ్లి తమిళనాడులోని మధురై జిల్లాలోని ఉసలంపట్టి సమీపంలో ఉన్న ఓ బావిలో తాడు కట్టి దాచిపెట్టారు. ఆరు నెలల పాటు పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎట్టకేలకు సాంకేతికత ఆధారంగా కేసును ఛేదించి బావి నుంచి బంగారం రికవరీ చేశారు. దోపిడీ వెనుక ఉన్న సూత్రధారులు విజయ్‌కుమార్, అజయ్‌కుమార్, అభిషేక, చంద్రు, మంజునాథ్, పరమానందలను అరెస్టు చేశారు. విజయ్‌కుమార్, అజయ్‌కుమార్, వారి బావమరిది పరమానంద తమిళనాడుకు చెందినవారు. వారు న్యామతిలో చాలా సంవత్సరాలుగా మిఠాయిల వ్యాపారం చేస్తున్నారు. మిగిలిన ముగ్గురు నిందితులు కర్నాటకకు చెందినవారు.
ప్రధాన సూత్రధారి సూత్రధారి విజయ్‌కుమార్ ఆరు నెలలకు పైగా దోపిడీకి ప్రణాళిక వేశాడు. మనీ హీస్ట్ వంటి టీవీ సిరీస్‌ల నుండి ప్రేరణ పొంది.. యూట్యూబ్ నుంచి దొంగతనాల గురించి రీసెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
