Unparliamentary Words: నోరే కదా ఏదైనా మాట్టాడేస్తాం అంటే కుదరదు.. ఈ పదాలు అస్సలు మాట్లాడొద్దు..
Words Banned In Parliament: పార్లమెంటులో అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌కి ఇకపై ఓ లెక్కుంది. పార్లమెంటే కదా ఏదైనా మాట్లాడేయొచ్చనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే..
నోరే కదా ఏదైనా మాట్టాడేస్తాం. ఎక్కడైనా మాట్లాడేస్తాం అంటే ఇకపై కుదరదుసుమా. పార్లమెంటులో అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌కి ఇకపై ఓ లెక్కుంది. పార్లమెంటే కదా ఏదైనా మాట్లాడేయొచ్చనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. “జుమ్లా జీవి’, కొవిడ్ స్పైడర్, స్నూప్ గేట్ లాంటి పెద్ద పెద్ద మాటలు మొదలుకొని, సర్వసాధారణంగా సభ్యులు మాట్లాడే సిగ్గుచేటు, వేధింపులు, మోసం, అవినీతి అసమర్థుడు అనే పదాలను సైతం ఇకపై పార్లమెంటులో మాట్లాడకూడదు. మరో నాలుగు రోజుల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆరంభం కానున్నాయి. జూలై 18 నుంచి ఆరంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఇకపై ఏదిపడితే అదిమాట్లాడ్డానికి రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే అనేక పదాలను ఇండియన్ పార్లమెంటులో వాడడంపై నిషేధం విధించారు. గతంలో ఉన్న పదాలకు తోడు, ఇప్పుడు మరికొన్ని కొత్త నిషేధిత పదాలను చేర్చారు. పార్లమెంటులో ఏ పదాలు మాట్లాడొచ్చు.
ఈ తప్పుడు పదాలు మాట్లాడొద్దు..
ఏ పదాలు మాట్లాడకూడదు అనే తాజా జాబితాని లోక్‌సభ సెక్రటేరియట్ బుక్‌లెట్ రూపంలో విడుదల చేసింది. లోక్‌సభలో “జుమ్లా జీవి’, కొవిడ్ స్పైడర్, స్నూప్ గేట్ పదాల వాడకంపై నిషేధం విధించారు. ఇందులో సర్వసాధారణంగా మాట్లాడే మాటలు సిగ్గుచేటు, వేధించడం, మోసగించడం, అవినీతిపరుడు, డ్రామా, హిపోక్రసీ, నియంత అనే పదాలపై కూడా ఇప్పుడు నిషేధం విధించారు. అంతేకాదు. తాజా జాబితా ప్రకారం శకుని, తానాషా, వినాశ పురుష్, ఖలిస్థానీ, ద్రోహచరిత్ర, చెంచా, చెంచాగిరి, పిరికివాడు, క్రిమినల్, మొసలి కన్నీళ్ళు, గాడిద, అసమర్థుడు, గూండాలు, అహంకారి, చీకటి రోజులు, దాదాగిరి, విశ్వాస ఘాతకుడు వంటి పదాలను కూడా గౌరవ సభ్యులు తమ ప్రసంగాల్లో వాడకూడదు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే లైంగిక వేధింపులు అనే పదాన్ని కూడా పార్లమెంటులో నిషేధం విధించడంపై స్త్రీవాదులు మండిపడుతున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఇలా చెబితే ఎలా..
పార్లమెంటు అంటేనే మాటల తూటాలు. విమర్శలు వెల్లువెత్తుతాయి. ఆ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటలు అగ్ని గోళాల్లా దూసుకొస్తాయి. చాలా సార్లు చాలా మంది నేతల నోట్లోనుంచి నిషేధిత పదాలూ దొర్లుతాయి. పార్లమెంటు నిబంధనల ప్రకారం సభలో కొన్ని పదాలను ఉపయోగించడంపై నిషేధం ఉంటుంది. అలాంటి పదాలను సైతం సభ్యులు ఉపయోగిస్తే, అప్పుడు అలాంటి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌ని రికార్డుల్లోనుంచి తొలగిస్తారు. అయితే ఈ జాబితాలో మరికొన్ని పదాలను చేర్చారు. ఇప్పుడదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
పార్లమెంటు నిషేధిత పదాల జాబితా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సర్వసాధారణంగా ఉపయోగించే పదాలను సైతం మాట్లాడొద్దనడం సరికాదంటూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మండిపడ్డారు. తాను వాటినే ఉపయోగిస్తానని, కావాలంటే సస్పెండ్ చేసుకోండంటూ ట్విట్టర్ వేదికగా ఒబ్రెయిన్ సవాల్ విసిరారు.