టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తున్నారా..? సీరియస్ యాక్షన్‌లోకి దిగిన దక్షిణ మధ్య రైల్వే!
1989 నాటి భారతీయ రైల్వే చట్టం ప్రకారం, టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం. మరి, టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన వారిని TTEలు జరిమానా విధిస్తారు. మళ్లీ మళ్లీ చేస్తే.. ఏకంగా జైలుకు కూడా పంపిస్తారు. తాజాగా టికెట్ తనిఖీలో దక్షిణ మధ్య రైల్వేస్ రికార్డు సృష్టించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనూ లేనంతగా.. ఈ జోన్ టిక్కెట్టు లేని ప్రయాణికుల నుంచి అత్యధిక ఆదాయం నమోదు చేసింది.

1989 నాటి భారతీయ రైల్వే చట్టం ప్రకారం, టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం. మరి, టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన వారిని TTEలు జరిమానా విధిస్తారు. మళ్లీ మళ్లీ చేస్తే.. ఏకంగా జైలుకు కూడా పంపిస్తారు. తాజాగా టికెట్ తనిఖీలో దక్షిణ మధ్య రైల్వేస్ రికార్డు సృష్టించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనూ లేనంతగా.. ఈ జోన్ టిక్కెట్టు లేని ప్రయాణికుల నుంచి అత్యధిక ఆదాయం నమోదు చేసింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీ ప్రక్రియలో రూ. 223.60 కోట్ల రికార్డు ఆదాయాన్ని రాబట్టినట్లు రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రైల్వే బోర్డు నిర్దేశించిన రూ . 221.08 కోట్ల లక్ష్యాన్ని, సంవత్సరం ముగియడానికి 14 రోజుల ముందే ఈ జోన్ అధిగమించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా టికెట్ తనిఖీ ద్వారా వచ్చిన అత్యధిక ఆదాయం ఇదే కావడం విశేషం. ఇంతకు ముందు 2023-24 సంవత్సరం లో రూ . 220.81 కోట్ల ఆదాయం వచ్చింది.
టికెట్ లేని ప్రయాణం, ముందుగా బుక్ చేయని లగేజీ మొదలైన వాటిపై నమోదైన కేసుల ద్వారా ఈ ఆదాయం ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ జోన్ ప్రస్తుత సంవత్సరంలో, 2025 అక్టోబర్ 18 న ఒకే రోజులో టికెట్ తనిఖీ ద్వారా రూ . 1.85 కోట్ల రికార్డు ఆదాయాన్ని ఆర్జించింది. రైల్వేలలో టిక్కెట్ల తనిఖీ అనేది, టిక్కెట్టు లేని, సరైన ఆధారాలు లేకుండా చేసే ప్రయాణాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అలవాటుగా ప్రతినిత్యం టిక్కెట్లు లేకుండా ప్రయాణం చేసేవారిని నిరోదిస్తూ, బుకింగ్ విండోల ద్వారా టిక్కెట్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడుతుంది.
రైలు ప్రయాణంలో అధీకృత టిక్కెట్ లేదా ప్రయాణ పత్రం కలిగి ఉండటం ప్రాముఖ్యత గురించి సాధారణ ప్రజలలో అవగాహన కల్పించడానికి కూడా ఇది సహాయపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. అంతేకాకుండా టిక్కెట్ల తనిఖీ చెల్లుబాటు అయ్యే టిక్కెట్లతో ప్రయాణించడంలో ఉండే సౌకర్యం గురించి ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడానికి తోడ్పడుతుంది. ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, టిక్కెట్ల అమ్మకాలను పెంచడానికి, బుకింగ్ విండోతో పాటు, టిక్కెట్ల జారీ కోసం టిక్కెటింగ్ వ్యవస్థలో అనేక డిజిటల్ కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ డిజిటల్ కార్యక్రమాలలో రైల్ వన్ యాప్, బుకింగ్ కౌంటర్ల దగ్గర ఏటీవీఎంలు, స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌ల టిక్కెట్ కొనుగోలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
