Joshimath: ఎన్టీపీసీ గో బ్యాక్.. జల విద్యుత్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు..
ఆందోళనలు, ఆవేదనలు, కన్నీళ్లు, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌లో ఇవాళ్టి పరిస్థితి. ఓ వైపు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను గుర్తించే పనిని అధికారులు వేగవంతం చేస్తుండగా.. ఈ పరిస్థితికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టే కారణమని, తక్షణం ఎన్టీపీసీ తమ రాష్ట్రాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలంటూ జనం రోడెక్కారు.

60 ఏళ్ల అనుబంధం.. ఇక ముగిసిపోయే సమయం వచ్చింది. ఈ ఊరు నాది.. ఈ నేల నాది అనుకున్న వాళ్లకు ఎప్పుడూ ఏదీ శాశ్వతం కాదన్న విషయం కళ్ల ముందే స్పష్టయ్యింది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న జోషి మఠ్ పట్టణంలో ఇప్పటి వరకు 678 ఇళ్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని అధికారులు తేల్చారు. ఇప్పటికే ఏ క్షణమైన కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లను గుర్తించి అందులో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. దీంతో కట్టుకున్న ఇంటిని వదలలేక కన్నీరు మున్నీరయ్యారు స్థానికులు. బాధితుల్ని స్వయంగా కలిసిన ఉత్తరాఖండ్ మంత్రి అజయ్ భట్ ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేశారు.
అటు ఇప్పటికే జోషి మఠ్ చేరుకున్న 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ పరిస్థితికి కారణాలేంటో కనుగొనే ప్రయత్నంలో ఉన్నాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామీ తెలిపారు. మరోవైపు కేంద్రం జోషిమఠ్‌లో మైక్రో సిస్మిక్ అబ్జర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించారు.
ముందు జాగ్రత్తగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న కొన్ని హోటళ్లను, సమారు 500 ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే మౌంట్ వ్యూ, మాలారి ఇన్ తదితర హోటళ్లను కూల్చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హోటళ్ల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పత్రికల ద్వారానే తమ హోటళ్లను కూల్చేస్తారన్న వార్త తెలిసిందని, కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు. కూల్చే ముందు ఇవ్వబోయే పరిహారం సంగతేంటో చెప్పకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు.
ఇక జోషిమఠ్ అంశంపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం దేశంలో ప్రతి విషయానికి కోర్టుకు రావాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో సంబంధించిన ప్రజాస్వామిక వ్యవస్థలు చూసుకుంటాయని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. జోషిమఠ్‌లో ఈ పరిస్థితి కారణం అక్కడ NTPC ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న తపోవన్ విష్ణుగడ్ జలవిద్యుత్ ప్రాజెక్టేనంటూ ఆందోళనకు దిగారు స్థానికులు. తక్షణం తమ రాష్ట్రాన్ని వదిలి వెళ్లాలని డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం




