Jal Jeevan Mission: ఏడాదిలో 1.3 లక్షల మందికిపైగా చిన్నారుల మరణాలకు అడ్డుకట్ట.. జల్ జీవన్ మిషన్‌పై నోబెల్ గ్రహీత అధ్యయనం
ఈ మిషన్ ప్రారంభంకాక ముందు దేశంలోని జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ మందికి సురక్షితమైన తాగునీరు లేదు. తాగేనీటిలో ఆర్సెనిక్ ,ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి ఆరోగ్యానికి హాని కలిగించే మూలకాలు, కాలుష్య కారకాలు ఉండేవి. ఇవి ప్రజలపై ముఖ్యంగా ఐదేళ్ల పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన పథకం జల్ జీవన్ మిషన్. ఆగస్టు 15, 2019న ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన ఈ పథకం అమలుకు కేంద్రం రూ. 3.60 లక్షల కోట్లు కేటాయించింది. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం కింద మరో రూ.1.42 లక్షల కోట్లు సమకూర్చుతోంది. కాగా ఈ మిషన్ ప్రారంభం నాటికి దేశంలో 3.23 కోట్ల(17 శాతం) గ్రామీణ ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉండగా.. ప్రస్తుతం ఇది 8.26 కోట్ల(43 శాతం)కు చేరడం విశేషం.
అయితే ఈ మిషన్ ప్రారంభంకాక ముందు దేశంలోని జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ మందికి సురక్షితమైన తాగునీరు లేదు. తాగేనీటిలో ఆర్సెనిక్ ,ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి ఆరోగ్యానికి హాని కలిగించే మూలకాలు, కాలుష్య కారకాలు ఉండేవి. ఇవి ప్రజలపై ముఖ్యంగా ఐదేళ్ల పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. డయేరియా లాంటి ప్రమాదకర వ్యాధులకు దారి తీశాయి. ఈ వ్యాధి కారణంగా ఎంతోమంది పిల్లలు మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే నీటి శుద్ధి ప్రక్రియ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే పిల్లల మరణాలను తగ్గించడం ప్రభుత్వాలకు సవాలుగా మారిపోయింది. వీటిన్నిటికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి సంక్షోభం రాకుండా ఈ మిషన్‌ను ప్రకటించింది.
కాగా అమెరికాకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్, నోబెల్ గ్రహీత మైఖెల్ క్రీమర్ జల్ జీవన్ మిషనంపై అధ్యయనం నిర్వహించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మిషన్ కారణంగా నీటి కాలుష్యాన్ని వీలైనంతవరకు అరికట్టవచ్చని, డయేరియా లాంటి వ్యాధులను దూరం చేయవచ్చునని, అన్నిటికీ మించి పిల్లల మరణాలను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.
‘ నీటి శుద్ధి ప్రక్రియ అనేది చాలా క్లిష్టమైనది. ఖర్చైనది. నా మెటా అనాలసిస్ ప్రకారం కుళాయి ద్వారా నీటి కాలుష్యాన్ని వీలైనంతవరకు అరికట్టవచ్చు. ఉదాహరణకు 2019 కు ముందు మహారాష్ట్రలోని పైప్డ్ వాటర్ శాంపిల్స్‌లో ఇ.కోలి 37 శాతంగా ఉంది. అయితే ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయింది. నా అంచనా ప్రకారం జల్ జీవన్ మిషన్‌ను సమర్థంగా అమలు చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన కుళాయి నీటిని అందిస్తే పిల్లల మరణాలను బాగా తగ్గించవచ్చు. ఒక ఏడాదిలో సుమారు 1,36,000 మంది పిల్లలను కాపాడుకోవచ్చు’ అని క్రీమర్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..