Israel Palestine Crisis: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. ఎందుకంటే..!
గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ కొనియాడింది.
Congress on Israel Palestine Crisis: పొరుగు దేశాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ స్వాగతించింది. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ కొనియాడింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం సమతుల్యతతో వ్యవహరించిందని, అయితే ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి తెలియజేయాలని బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి విడుదలైన లేఖలో భారత ప్రభుత్వాన్ని కోరింది. ‘‘ఇరు దేశాలు ఘర్షణను వీడాలి. చర్చలతో శాంతిని నెలకొల్పాలి. ఇంతకు మించి అర్థవంతమైన దారి మరొకటి లేదు. ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య పరస్పర సహకారం, శాంతి కొనసాగాలి’’ అని కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా, ఆదివారం నిర్వహించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టి.ఎస్. తిరుమూర్తి మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ దాడులుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాలస్తీనాకు మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తామెప్పుడు హింస, రెచ్చగొట్టడం, వినాశనానికి వ్యతిరేకమేనని తేల్చి చెప్పారు. అయితే, సమస్యను ఆ రెండు దేశాలే చర్చలతో పరిష్కరించుకోవాలని తిరుమూర్తి స్పష్టం చేశారు.
మరోవైపు, వరుసగా 11వ రోజూ ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ 100కు పైగా దాడులు చేసింది. బదులుగా పాలస్తీనా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ మీద రాకెట్ల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ల మధ్య తూర్పు జెరూసలెం గురించి కొన్ని వారాలుగా ఉద్రిక్తతలు చెలరేగాయి. అల్ అక్సా మసీదు కోసం యూదులు, అరబ్బుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలూ దానిని తమ పవిత్ర స్థలంగా భావిస్తున్నాయి.
Read Also… Income Tax Returns: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట.. ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు