AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Isha Foundation Case: సద్గురు ఇషా ఫౌండేషన్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ..!

ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు భారత అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఇషా ఫౌండేషన్‌పై పోలీసుల విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసు విచారణ అక్టోబర్ 18న జరగనుంది.

Isha Foundation Case: సద్గురు ఇషా ఫౌండేషన్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ..!
Supreme Court On Isha Foundation
Balaraju Goud
|

Updated on: Oct 03, 2024 | 5:00 PM

Share

ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు భారత అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఇషా ఫౌండేషన్‌పై పోలీసుల విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసు విచారణ అక్టోబర్ 18న జరగనుంది. తమపై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై ఇషా ఫౌండేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్టే ఆర్డర్‌ను జారీ చేసింది.

ఇషా ఫౌండేషన్‌పై రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో తన ఇద్దరు కుమార్తెలు గీత (42), లత (39)లకు ఆశ్రమం ద్వారా బ్రెయిన్ వాష్ చేశారని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. అయితే అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఇష్టానుసారం ఆశ్రమంలో ఉంటున్నారని ఇషా ఫౌండేషన్ చెబుతోంది. ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు (అక్టోబర్ 3) దీనిపై విచారణ జరిపింది. పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మద్రాసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసింది. స్టేటస్ రిపోర్ట్‌ను తనకు సమర్పించాలని పోలీసులను కోరింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 18న జరగనుంది.

సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా, ఆశ్రమంలో పోలీసుల ఉనికిపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. మొదటి విషయమేమిటంటే.. ఇలా క్యాంపస్‌లోకి పోలీసు బలగాలను అనుమతించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒక జ్యుడీషియల్ ఆఫీసర్ వెళ్లి అమ్మాయిలిద్దరినీ విచారించాలని సూచిచారు. విచారణ సమయంలో, ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరు ఆన్‌లైన్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. తన ఇష్టానుసారం ఆశ్రమంలో జీవిస్తున్నానని ఆమె పునరుద్ఘాటించారు. గత ఎనిమిదేళ్లుగా తన తండ్రి తనను వేధిస్తున్నాడని ఆరోపించింది.

ఇషా ఫౌండేషన్‌కు సంబంధించిన అన్ని క్రిమినల్ కేసులను తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సెప్టెంబర్ 30న మద్రాస్ హైకోర్టు గతంలో పేర్కొంది. దీని తరువాత, అక్టోబర్ 1న, ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ఆశ్రమానికి చేరుకున్నారు. కోయంబత్తూరు రూరల్ పోలీసులు మంగళవారం నాడు 150 మంది సిబ్బందితో ఇషా ఫౌండేషన్‌కు చెందిన ఆశ్రమంలోకి వెళ్లి విచారణ చేపట్టారు. ఫౌండేషన్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసులపై నివేదికను కోరిన మద్రాస్ హైకోర్టు విచారణకు ఆదేశించిన ఒక రోజు తర్వాత సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..