Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himalayan Glaciers: జలప్రళయం రానుందా? ఈ సంకేతాలే నిదర్శనమా? భయపెడుతున్న వరుస ఘటనలు

జలప్రళయం రావడానికి ఇంకా ఎంతో కాలం లేదా? ప్రకృతి విపత్తులు మానావళి మనుగడను దెబ్బతీయనున్నాయా? వేగంగా కరిగిపోతున్న హిమానీ నదాలు ప్రపంచానికి పెనుసవాల్‌గా మారునున్నాయా? హిమాలయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Himalayan Glaciers: జలప్రళయం రానుందా? ఈ సంకేతాలే నిదర్శనమా? భయపెడుతున్న వరుస ఘటనలు
Human Life
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 07, 2023 | 8:18 AM

జలప్రళయం రావడానికి ఇంకా ఎంతో కాలం లేదా? ప్రకృతి విపత్తులు మానావళి మనుగడను దెబ్బతీయనున్నాయా? వేగంగా కరిగిపోతున్న హిమానీ నదాలు ప్రపంచానికి పెనుసవాల్‌గా మారునున్నాయా? హిమాలయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

హిమాలయాల్లోని నదాలు కుచించుకుపోతున్న తీరు భవిష్యత్‌ను అంధకారం చేస్తుందని పర్యావరవణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలోని ఇతర పర్వతాలతో పోల్చితే హిమాలయాల్లో మంచు కరుగుతున్న తీరు చాలా అధికంగా ఉంది. మంచు యుగంతో పోల్చితే హిమాలయ నదాలు 40 శాతం తగ్గిపోయాయట. గడిచిన 700 ఏళ్లలో ఇది తీవ్రరూపం దాల్చిందనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదే ధోరణి కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి మరో మూడో వంతు నదాలు కనుమరుగు కావడం ఖాయమట. ఈ కారణంగా 2050 వరకు మంచు కరిగి నీటి ప్రవాహం బాగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

హిమాలయాల్లో వేగంగా మారుతున్న పరిస్థితులపై ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్య సంస్థలు పరిశోధన నిర్వహిస్తున్నాయి. ఇంగ్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ హిమాలయాల్లో చోటుచేసుకుంటున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ విశ్వవిద్యాలయం మంచు యుగం నాటి 14,798 హిమానీ నదాలను పునర్‌నిర్మించింది. ఆ అధ్యయనం ఆధారంగా గడిచిన కొన్ని దశాబ్దాల్లోనే హిమాని నదాల్లోని మంచు పది రెట్లు వేగంగా కరిగిపోయిందని నిర్థారించారు. అంతే కాదు ఒకప్పుడు 28 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన హిమానీ ప్రాంతాలు ప్రస్తుతం 19,600 చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయాయని తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ ఆ తరహా ప్రకృతి విపత్తులను మనం చూశాం. 2013, 2022లో వచ్చిన విపత్తులు పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను అతలాకుతలం చేశాయి. 2013 జూన్‌ 13, 17 తేదీల మధ్య ఉత్తరాఖండ్‌లో అసాధారణ రీతిలో కుంభవృష్టి కురిసింది. దీంతో చోరాబాడి హిమానీ నదం కరిగిపోయింది, దీంతో మందాకిని నది రూపం విచ్ఛిన్నమైంది. ఈ నది ప్రవాహం వెంబడి భారీస్థాయిలో బురద, పెద్ద పెద్ద బండరాళ్లు వచ్చాయి. ఈ ప్రకృతి విపత్తులో 5000 మందికి పైగా మరణించారు. ఇది సృష్టించిన సంపద నష్టం అంతా ఇంతా కాదు.

భూతాపం పెరుగుదల ప్రభావం ఘనీభవజలంపై అనేక రూపాల్లో కనిపిస్తోంది. హిమాలయాల్లోని హిందు కుష్‌ పర్వతశ్రేణుల్లో ఈ ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని పర్యావరణవేత్తలు అంటున్నారు. భూతాపం కారణంగా ఒక వైపు హిమానీ నదాలు కరిగిపోతుంటే మరో వైపు భారత్‌లో వడగాలు తీవ్రత పెరిగిపోతోంది. ఎండల తీవ్రత సాధారణ ప్రజల జీవనాన్ని నరకప్రాయం చేస్తోంది.

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగానదిపై ఈ ప్రభావం ఇప్పటికే పడింది. గంగా నదిలోకి నీటి ప్రవాహం తగ్గిపోయింది. అంతే కాదు గంగా నదిలోకి ఎక్కడి నుంచి అయితే జలాలు వస్తాయో ఆ హిమానీ నదాలు దూరంగా జరిగిపోతున్నాయి. గంగానదిని అమ్మవారిగా కొలిచే భక్తులు ఈ పావన నది కలకాలం నిలిచి ఉండాలని ప్రార్థిస్తున్నారు.

భాగీరథి బేసిన్‌లోని కొన్ని హిమానీ నదాలను ప్రఖ్యాత వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ సంస్థ పరిశీలించింది. అందులో డొక్రియాని హిమానీ నదం 1995 నుంచి 15-20 మీటర్లు వెనక్కి తగ్గినట్టు గుర్తించారు. అంతే కాదు మందాకిని నది బేసిన్‌లోని చోరాబాడి హిమానీనదరం 2003-2017 మధ్య కాలంలో 9-11 మీటర్లు వెనక్కి తగ్గినట్టుగా నిర్థారించారు. ఉత్తరాఖండ్‌లో వ్యాపించి ఉన్న మిగిలిన హిమానీ నదాలది ఇదే పరిస్థితి.

హిమాలయాల్లోని హిమానీనదాలు కరుగుతున్న తీరుపై నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ అనేక అధ్యయనాలు నిర్వహిస్తోంది. ఈ అధ్యయనాలపై కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది.

భూతాపాన్ని నియంత్రించకపోతే ఈ హిమానీ నదాలకు ముప్పు తప్పదు. వాటిపై ఆధారపడి జీవనం సాగించే వారికి కష్టాలు తప్పవు. హిమానీ నదాలు వేగంగా కరిగిపోవడం వల్ల మొత్తం ఈశాన్య రాష్ట్రాలన్ని అతలాకుతలం కాకతప్పదు. అంతే కాదు జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు పెను ముప్పు సంభవిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..