IPL 2025: ‘తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ ఎంట్రీలోనే అదుర్స్.. కట్‌చేస్తే.. ఏడాదికే కెరీర్ క్లోజ్’
Virender Sehwag: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఒక బంగారు సలహా ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత IPL 2025లో అరంగేట్రం చేశాడు మరియు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అరంగేట్ర ఆటగాడు అయ్యాడు. తన ఐపీఎల్ కెరీర్‌లోని మొదటి బంతికే సిక్స్ కొట్టడంతో అతను మరిన్ని వార్తల్లో నిలిచాడు.

Vaibhav Suryavanshi: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి కీలక సలహా ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత ఐపీఎల్ (IPL) 2025లో అరంగేట్రంతో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. తన ఐపీఎల్ కెరీర్‌లోని మొదటి బంతికే సిక్స్ కొట్టడంతో టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. IPL 2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లు చెల్లించి జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ కెరీర్‌ను సిక్స్‌తో ప్రారంభించిన బుడ్డోడు..
అతి చిన్న వయసులోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ 14 ఏళ్ల బాలుడు టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ బంతిని సిక్స్ కొట్టడం ద్వారా తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. చాలా మంది భారత దిగ్గజాలు ఈ చిన్నోడిపై ప్రశంసలు కురిపించాడు. చాలామంది అతన్ని టీం ఇండియా తదుపరి సూపర్ స్టార్ అని కూడా పిలుస్తున్నారు. అయితే, ఇప్పుడు దిగ్గజ భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అతనికి ఒక కీలక సలహా ఇచ్చాడు.
వైభవ్‌కు సెహ్వాగ్ కీలక సలహా..
ఇది అతనికి ప్రారంభం మాత్రమే అంటూ సెహ్వాగ్ వైభవ్‌కు సలహా ఇచ్చాడు. ఈ ప్రారంభంతో వైభవ్ సంతోషంగా ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. అతను ఎక్కువ కాలం ఆడాలని లక్ష్యంగా పెట్టుకోవాలంటూ సూచించాడు. ఇటీవల, క్రిక్‌బజ్‌లో మాట్లాడిన సెహ్వాగ్, ‘మంచి ప్రదర్శనకు ప్రశంసలు అందుకుంటారని, బాగా రాణించనందుకు విమర్శలు వస్తాయని తెలుసుకోవాలి. మైదానంలోకి ప్రవేశిస్తే, ఎంతో కంట్రోల్‌గా ఉండాలి. ఒకటి లేదా రెండు మ్యాచ్‌లతో కీర్తి పొందిన చాలా మంది ఆటగాళ్లను నేను చూశాను. అప్పుడే వారంతా స్టార్ ప్లేయర్‌లు అయ్యారని భావిస్తే, అంతకన్నా పొరపాటు ఉండదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2026 నుంచి తొలగిస్తే..
విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవాలని సెహ్వాగ్ వైభవ్‌ను కోరాడు. ‘విరాట్ కోహ్లీని చూడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘కోహ్లీ 19 సంవత్సరాల వయసులో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు 18 సీజన్లుగా ఆడుతున్నాడు. వైభవ్ ఈ లక్ష్యాన్ని మనసులో ఉంచుకోవాలి. కానీ, అతను తన మొదటి బంతికి సిక్స్ కొట్టి కోటి రూపాయలు సంపాదించడం వల్లే ఈ స్థానాన్ని సాధించానని అనుకుంటే, బహుశా అతను తరువాతి సీజన్‌లో ఆడలేకపోవచ్చు’ అని హెచ్చరించాడు.
తొలి మ్యాచ్‌లోనే హీరోగా..
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 14 ఏళ్ల బాలుడు అంతర్జాతీయ బౌలర్లను ఎలా ఓడించాడో చూడొచ్చు. 20 బంతుల్లో 34 పరుగులు చేసి, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో అలరించాడు. అయితే, RCBతో జరిగిన రెండో మ్యాచ్‌లో, అతను 12 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. IPL 2025లో ఇప్పటివరకు, వైభవ్ రెండు మ్యాచ్‌ల్లో 50 పరుగులు చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








