1971 Indo-Pak War: ఆ యుద్ధంలో 100 మందితో పాక్‌పై వీరోచితంగా పోరాడిన మేజర్ ఇక లేరు.. అస్తమించిన శౌర్య పురస్కార గ్రహిత

పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య జరిగిన 1971 యుద్ధం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ ఓడించిన కారణంగానే నేటి బంగ్లాదేశ్(ఒకప్పటి తూర్పు పాకిస్థాన్) ఒక ప్రత్యేక దేశంగా..

1971 Indo-Pak War: ఆ యుద్ధంలో 100 మందితో పాక్‌పై వీరోచితంగా పోరాడిన మేజర్ ఇక లేరు.. అస్తమించిన శౌర్య పురస్కార గ్రహిత
Brigadier Kuldip Singh Chan
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Ravi Kiran

Updated on: Nov 17, 2022 | 11:51 AM

పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య జరిగిన 1971 యుద్ధం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ ఓడించిన కారణంగానే నేటి బంగ్లాదేశ్(ఒకప్పటి తూర్పు పాకిస్థాన్) ఒక ప్రత్యేక దేశంగా అవతరించింది. అయితే ఈ యుద్ధంతో కేవలం 100 సైనికులతో 2000 మంది పాకిస్థానీ సైనికులపై వీరోచితంగా పోరాడి విజయం సాధించిన బ్రిగేడియర్ కులదీప్ సింగ్ చాంద్‌పురి బుధవారం మరణించారు. కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన పంజాబ్‌లోని మొహాలీలో ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన తుది శ్వాసను విడిచారు. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజుల్లో కులదీప్ సింగ్ చాంద్‌పురి పశ్చిమ సెక్టార్‌లో పోస్ట్‌లో మేజర్‌గా ఉన్నారు. ఆయన కేవలం 100 మంది సైనికులతో రాజస్థాన్‌లోని లాంగేవాలా సరిహద్దులో 2000 మంది పాకిస్తాన్ సైనికులతో పోరాడి ఆ ప్రాంతాన్ని రక్షించారు.

1971 డిసెంబర్ 4, 5 తేదీల్లో లాంగేవాలా పోస్ట్‌ను దాటి ముందుకు సాగాలనుకునున్న పాకిస్తానీ సైనికుల ప్రయత్నాన్ని చాంద్‌పురి నాయకత్వంలోని బలగాలు విఫలం చేశాయి. లాంగేవాలా యుద్ధంలో కులదీప్ సింగ్ చాంద్‌పురి కనబర్చిన అసాధారణ నాయకత్వానికి మెచ్చిన భారత ప్రభుత్వం.. దేశంలోని రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం అయిన మహా వీర్ చక్రతో ఆయనను సత్కరించింది. అతని మహావీర్ చక్ర అవార్డుకు సంబంధించిన డిస్ర్కిప్షన్‌లో ‘‘మేజర్ కులదీప్ సింగ్ చాంద్‌పురి రాజస్థాన్ సెక్టార్‌లోని పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన లాంగేవాలా యుద్ధంలో డైనమికల్ నాయకత్వాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించారు. భారత రక్షణ బలగాలు అక్కడకు వచ్చే వరకు ఒక బంకర్ నుంచి మరో బంకర్‌కు వెళ్లడానికి ఆయన తన అనుచరులను ప్రేరేపించాడు’’ అని ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కాగా, 1997లో.. జేపీ దత్తా దర్శకత్వంలో వచ్చిన ‘బోర్డర్’ సినిమా లోంగేవాలా యుద్ధం ఆధారంగా రూపొందించిన చిత్రమే. ఆ సినిమాలో చాంద్‌పురి పాత్రలో సన్నీ డియోల్ నటించారు. భారత సైనికుడిగా దేశసేవను ప్రారంభించిన ఆయన బ్రిగేడియర్‌గా పదవీ విరమణ చేశారు. కులదీప్ సింగ్ చాంద్‌పురి మృతి పట్ల పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంతాపం తెలిపారు. ‘‘సింగ్ చాంద్‌పురి చాలా ధైర్యవంతుడు, ప్రత్యేకమైన సైనికుడు. ఆయన మరణంతో దేశం మరింత పేదదయింది’’ అని కెప్టెన్ ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం.. ఈ లింక్ మీద క్లిక్ చేయండి..