Corona: బాబోయ్.! పెరుగుతోన్న కరోనా కేసులు.. డబ్ల్యూహెచ్ఓ ఏమందంటే.?
మరోసారి కోవిడ్ భయం వెంటాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు.. పాత రోజుల్ని గుర్తు చేస్తుండటంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పందించింది. ఇటు వైద్యులు కూడా కీలక సూచన చేశారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓసారి ఈ స్టోరీ చూసేయండి.

దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. రోజురోజుకూ కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,758కి చేరింది. ఈ పరిణామం ప్రజల్లో మళ్లీ కొవిడ్ భయాలను రేకెత్తిస్తోంది. కొవిడ్ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పందించింది. వ్యాప్తిలో ఉన్న ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8.1 సబ్ వేరియంట్లను ‘పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లు’గా వర్గీకరించింది. పలు దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ఆస్పత్రుల్లో చేరికలు ఒకేసారి పెరుగుతున్నా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు ఏమీ లేవని తెలిపింది.
ఇప్పటికే ఆమోదం పొందిన కొవిడ్ వ్యాక్సిన్లు ఈ వేరియంట్ లక్షణాలు, ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని చెబుతున్నారు. ప్రయాణాల్లోనూ, జనసమూహాల్లో ఉన్నప్పుడు తప్పని సరిగా మాస్కులు వాడాలని సూచించారు. కొవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..








