AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హర్యానాలో రహస్య లేఖ కలకలం.. అందులో నిజామాబాద్‌ వ్యక్తి చిరునామా.. రంగంలోకి కేంద్ర సంస్థలు!

ఓ ఆకాశరామన్న రాసిన ఉత్తరం అనేక సందేహాలు రేకెత్తిస్తోంది. అందులో ఉన్న విషయాలు మనుషుల అక్రమ రవాణాకు సంబంధించింది కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ లేఖ వ్యవహారం.. అందులోని విషయాలపై విచారణపై మొదలుపెట్టారు. ఆ లెటర్​పై తెలంగాణలోని నిజామాబాద్​కు చెందిన ఆలకుంట సంపత్ చిరునామా ఉండటం కలకలం రపింది.

హర్యానాలో రహస్య లేఖ కలకలం.. అందులో నిజామాబాద్‌ వ్యక్తి చిరునామా.. రంగంలోకి కేంద్ర సంస్థలు!
Haryana Mystery Letter
Shaik Madar Saheb
|

Updated on: Jun 02, 2025 | 9:43 AM

Share

హర్యానాలోని శివాలయంలో దొరికిన ఓ రహస్య లేఖ కలకలం రేపింది. ఆ లేఖలో దేశవ్యాప్తంగా 100 మందిని కిడ్నాప్ చేసి పాకిస్థాన్, దుబాయ్​కి అక్రమ రవాణా చేసినట్లు ఉంది. హిస్సార్​లోని రెడ్ స్క్వేర్ మార్కెట్​లోని శివాలయం వద్ద ఆలయ పూజారి సురేశ్​కు ఈ లెటర్ దొరికింది. ఆయన వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూజారి సురేశ్ శనివారం ఉదయం 6 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచినప్పుడు గోధుమ రంగు కవరులో ఒక లేఖ కనిపించింది. ఆయన దానిని తెరిచి చూస్తే అందులో సంచలన విషయాలు ఉన్నాయి. ఆ లెటర్​పై తెలంగాణలోని నిజామాబాద్​కు చెందిన ఆలకుంట సంపత్ చిరునామా ఉంది. దీంతో పూజారి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వివిధ నగరాల్లో 80- 100 మందిని కిడ్నాప్ చేసినట్లు వెల్లడి

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులోని విషయాలను పరిశీలించారు. హిస్సార్, అంబాలా, గురుగ్రామ్, సిర్సా, రేవారి, గంగానగర్, అజ్మీర్, నర్వానా సహా దేశంలోని వివిధ నగరాల నుంచి 80- 100 మందిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి దుబాయ్, పాకిస్థాన్‌కు విక్రయించినట్లు లేఖలో ఉంది. ఘటన తీవ్రతను గమనించిన పోలీసులు లేఖను సీనియర్ అధికారులకు అందించారు. వెంటనే ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

2018 నుంచి ఈ అక్రమ రవాణా ప్రారంభించామని వివరణ

లేఖ రాసిన వ్యక్తి తన పేరు వెల్లడించలేనని అందులో పేర్కొన్నాడు. తాము 2018 నుంచి ఈ అక్రమ రవాణా ప్రారంభించామని… ఫతేహాబాద్​కు చెందిన ఒక కుటుంబం తమకు సహాయం చేసేదని అందులో వెల్లడించాడు. వారు లక్ష్యాలను ఎంచుకుని ప్రేమ లేదా డబ్బు లావాదేవీల ద్వారా ప్రజలను వలలో వేసుకునేవారన్నాడు. హిస్సార్​కు చెందిన సుమిత్ గార్గ్, అంబాలా వాసి దిగ్విజయ్, నర్వానాకు చెందిన నవీన్ రోహిలా, గురుగ్రామ్‌ వాసి అమర్​నాథ్, ఎల్లనాబాద్‌కు చెందిన వినోద్ కుమార్, అమిత్ బాగ్రి, రేవారీకి చెందిన అన్షు గులాటి, గంగానగర్​కు చెందిన రోహిణి, సన్నీ, అజ్మీర్​కు చెందిన అంకిత్ శర్మ, సిర్సాకు చెందిన అనూజ్, యాజ్​పుర్​కు చెందిన నరేశ్​ను వేరే దేశాలకు అక్రమ రవాణా చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు.

ఒకరు పాకిస్థాన్ నుంచి పారిపోయారని లేఖలో ప్రస్తావన

ఇందులో ఒకరు పాకిస్థాన్ నుంచి పారిపోయారని కూడా లేఖలో వివరించాడు. పారిపోయిన యువకుడిని పట్టుకుని చంపమని లేదా అతని కుటుంబం నుంచి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయమని ఈ ముఠా నాయకురాలు బెదిరిస్తోందని.. అందుకే భయపడి ఈ లేఖ రాస్తున్నానని అందులో పేర్కొన్నాడు. ఈ లేఖలో హిస్సార్​కు చెందిన సుమిత్ గార్గ్ గురించి ప్రస్తావించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిస్సార్ లో సుమిత్ అనే పేరు ఉన్న నాలుగైదు మంది కనిపించకుండాపోయినట్లు తేలింది. వారిలో ఎవరు అక్రమ రవాణాకు గురయ్యారో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వారి కుటుంబాలను సంప్రదించారు. అలాగే అక్రమ రవాణాకు సాయం చేసిన ఫతేహాబాద్‌కు చెందిన కుటుంబం కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

కేంద్ర సంస్థలను సంప్రదించిన హరియాణా పోలీసులు

పాకిస్థాన్, దుబాయ్ వంటి ప్రదేశాలకు భారతీయుల అక్రమ రవాణా జరుగుతుందని ప్రస్తావించడం వల్ల దర్యాప్తు సంస్థలు ఈ లేఖను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేపట్టడానికి హరియాణా పోలీసులు కేంద్ర సంస్థలను సంప్రదించారు. అదే సమయంలో లేఖలో పేర్కొన్న వ్యక్తుల అదృశ్యాన్ని ధ్రువీకరించడానికి వారి కుటుంబాలను సంప్రదిస్తున్నారు. మానవ అక్రమ రవాణా గురించి లెటర్ వైరల్ కావడం వల్ల హిస్సార్, దాని పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. స్థానికులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండి, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. లేఖ కవర్‌పై పేరు ఉన్న వ్యక్తిని కనుగొనడానికి ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని హిస్సార్ పోలీసు సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అతి త్వరలో నిజం అందరికీ తెలుస్తుందన్నారు. పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..