India Shining: భారత దేశం మెరిసిపోతోంది.. ఏకంగా రష్యానే వెనక్కి నెట్టేసి నాలుగో స్థానానికి ఇండియా!

భారత దేశం వెలిగిపోతోంది. సంపన్న దేశాల సరసన చేరేందుకు భారత్ ఉరకలు వేస్తోంది. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న మాట కాదు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ అవలంభించిన సోషలిస్టు..

India Shining: భారత దేశం మెరిసిపోతోంది.. ఏకంగా రష్యానే వెనక్కి నెట్టేసి నాలుగో స్థానానికి ఇండియా!
Foreign Exchange Min
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 15, 2021 | 5:29 PM

India Shining again under Modi regime: భారత దేశం వెలిగిపోతోంది. సంపన్న దేశాల సరసన చేరేందుకు భారత్ ఉరకలు వేస్తోంది. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న మాట కాదు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ అవలంభించిన సోషలిస్టు విధానాల కారణంగా 1990, 1991లో విదేశీ మారక నిల్వలు లేక టన్నుల కొద్దీ బంగారాన్ని అమ్ముకునే దుస్థితికి చేరిన దేశంలో ఇవాళ విదేశీ మారక నిల్వలు అపారంగా వున్న దశకు చేరుకుంది. ఈ పరిస్థితికి బీజం వేసింది దివంగత ప్రధాన మంత్రి పివి నరసింహారావు అన్న విషయం నిర్వివాదాంశం. బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడమో, లేక ఏకంగా తెగనమ్ముకోవడమో చేస్తేనే గానీ దేశ ఖజానాలో చిల్లి గవ్వ లేని పరిస్థితిలో ప్రధాన మంత్రిగా అనూహ్యంగా బాధ్యతలు చేపట్టిన పీవీ.. దేశం యొక్క దిశను ముందుగా మార్చేశారు. ఆ తర్వాత దశ దానంతట అదే మారిపోయేలా చేశారు. ముప్పై ఏళ్ళ క్రితం తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇవాళ భారత్‌ను ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబాకేలా చేసింది.

తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం భారత దేశం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఏకంగా రష్యాను వెనక్కి నెట్టేసింది. నాలుగో స్థానానికి ఎగబాకింది. విదేశీ-మారక నిల్వల్లో రష్యాను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతి పెద్ద విదేశీ మారక నిల్వల దేశంగా ఇండియా నిలిచింది. సౌత్ ఏషియన్ కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్ పెట్టుబడుల ఉపసంహరణ చర్యలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడానికి డాలర్లను నిల్వ చేయడంతో భారత్‌ విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది పెట్టుబడులు వేగంగా పెరిగిన తరువాత రష్యా, ఇండియా దేశాల విదేశీ మారక నిల్వలు దాదాపు సమానమయ్యాయి. కాగా గడచిన కొద్ది వారాల్లో రష్యా కంపెనీల్లో పెట్టుబడులు వేగంగా తగ్గిపోయాయి. దాంతో రష్యా, భారత్ దేశాల ర్యాంకులు తారుమారయ్యాయి. భారత్ ఓ ర్యాంకు ముందుకు వచ్చింది. ఫలితంగా ప్రపంచం విదేశీ మారక నిల్వల్లో భారత్‌ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.

మార్చి 5వ తేదీ నాటికి భారత దేశ విదేశీ కరెన్సీ హోల్డింగ్స్ 580.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే అంతకు ముందు వారంతో పోలిస్తే 4.3 బిలియన్ డాలర్లు తగ్గాయి. రష్యా 580.1 బిలియన్‌ డాలర్ల మారక నిల్వలు కలిగి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం విదేశీ మారక నిల్వల్లో మొదటి స్థానంలో డ్రాగన్ కంట్రీ చైనా ఉండగా, తరువాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా జపాన్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఆ తర్వాత స్థానానికి ప్రస్తుతం భారత్ చేరింది. ప్రస్తుతం మన దేశం దగ్గర సుమారు 18 నెలల దిగుమతులను చేయడానికి సరిపోయే విదేశీ మారక ద్రవ్యం నిల్వలున్నాయి. అరుదైన కరెంట్-అకౌంట్ మిగులు, స్థానిక స్టాక్ మార్కెట్‌లోకి పెట్టుబడుల పెరుగుదల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధికంగా రావడంతో మారక నిల్వలు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు బలమైన విదేశీ మారక నిల్వలతో విదేశీ పెట్టుబడిదారులకు, క్రెడిట్ రేటింగ్ కంపెనీలకు ప్రభుత్వం రుణ బాధ్యతలను తీర్చే అవకాశం వుందని ఆర్థిక రంగ నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా వుండగా.. గత కొత్తి నెలలుగా భారత దేశం విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీ స్థాయిలో పెరిగాయని దేశీయ బ్యాంకింగ్ నిఫుణులు చెబుతున్నారు. డ్యూయిష్ బ్యాంక్ ఇండియా చీఫ్ కౌశిక్ దాస్ కథనం ప్రకారం ‘‘ ఫారిన్‌ ఎక్స్చేంజ్ నిల్వలు గణనీయంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థకు ఏదైనా బాహ్య షాక్-ఆధారిత మూలధన-స్టాప్, రాబోయే కాలంలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగినా కూడా సులువుగా రిజర్వు బ్యాంకు వాటిని డీల్‌ చేయగలదు. సెంట్రల్ బ్యాంక్ డేటా ప్రకారం గత సంవత్సరం స్పాట్ ఫారీన్‌ ఎక్స్చేంజ్‌ మార్కెట్లో రిజర్వు బ్యాంకు 88 బిలియన్ డాలర్లను నికరంగా కొనేసింది. ఇది గత సంవత్సరం ఆసియాలోని ప్రధాన కరెన్సీలలో రూపాయి విలువ చెత్తగా ప్రదర్శించడానికి సహాయపడింది. రూపాయి విలువ సోమవారం 0.1% పెరిగి డాలర్‌కు 72.71 కు చేరుకుంది. ఇటీవలి రిజర్వు బ్యాంకు నివేదిక-2013 విదేశీ-మారక నిల్వలను మరింత బలోపేతం చేయాలని సిఫారసు చేసిన నేపథ్యంలో కేంద్ర తీసుకున్న కొన్ని నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దారి తీశాయని ఆర్థిక రంగ నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: మార్చి 18న తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌.. ప్రత్యేక రాష్ట్రమొచ్చాక బడ్జెట్ కేటాయింపుల లెక్కలివే..!

ALSO READ: తెలంగాణలో చాపకింద నీరులా కరోనా విస్తృతి.. వారం రోజులుగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

ALSO READ: ఏపీలో తిరుగులేని వైసీపీ.. మరింతగా పడిపోయిన విపక్షాల బలం.. టీడీపీ ఓట్ల శాతంలో భారీ తరుగుదల