Corona Updates: తెలంగాణలో చాపకింద నీరులా కరోనా విస్తృతి.. వారం రోజులుగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర వల్లనే ఈ విజృంభణ అనుకుంటూ పలు రాష్ట్రాలు పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లోను…

Corona Updates: తెలంగాణలో చాపకింద నీరులా కరోనా విస్తృతి.. వారం రోజులుగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 15, 2021 | 3:34 PM

Corona updates of Telangana state: దేశంలో కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర వల్లనే ఈ విజృంభణ అనుకుంటూ పలు రాష్ట్రాలు పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లోను కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెలంగాణలోను కనిపిస్తోంది. తెలంగాణలో ప్రతీ రోజు నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణకు పొరుగునే వున్న మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఇటు కర్నాటకలో అయితే దక్షిణాఫ్రికాకు చెందిన కరోనా స్ట్రెయిల్ వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు తెలంగాణకు పొరుగునే వుండడం వల్ల ఇక్కడ కూడా కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీనికి గత ఆరేడు రోజులుగా నమోదవుతున్న గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తెలంగాణలోని 26 జిల్లాలో కరోనా కేసుల సంఖ్య గత వారం రోజులుగా పెరుగుతోంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మార్చి 8వ తేదీన 31 కరోనా కేసులు నమోదు అవగా.. మార్చి 13వ తేదీన 46 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో మార్చి ఎనిమిదవ తేదీన 10 కేసులు నమోదైతే.. మార్చి 13న 15 కేసులు నమోదయ్యాయి. అంటే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న సంకేతాలు ఈ గణాంకాల ద్వారా బలపడుతున్నాయి. కొన్ని చోట్ల తక్కువ సంఖ్యలోను, మరికొన్ని చోట్ల కాస్త ఎక్కువ సంఖ్యలోను కరోనా కేసులు నమోదవుతున్నాయి. మార్చి 13న తెలంగాణ వ్యాప్తంగా 50 వేల 998 మందికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో 228 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 92 లక్షల 465 కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో మూడు లక్షల ఒక వేయి 161 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల 97 వేల 515 కాగా.. మార్చి 13న కొత్తగా 152 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఇక మృతుల సంఖ్యను చూస్తే రాష్ట్రంలో ఇప్పటి వరకు 1653 మంది కరోనా సోకి మరణించారు. మార్చి 13న ఒక మరణం రికార్డయ్యింది.

ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా 1993 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులున్నాయి. అందులో ఐసోలేషన్ సెంటర్లలో 795 మంది వున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ 98.78 శాతంగా వుంది. మరణాల రేటు 0.54 శాతంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రతీ పది లక్షల మందిలో రెండు లక్షల 47 వేల 191 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 13న నిర్వహించిన 50 వేల 998 కరోనా పరీక్షల్లో 46 వేలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోను, 4 వేల 931 పరీక్షలు ప్రైవేటులోను చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న కరోనా యాక్టివ్ కేసుల్లో 590 మంది ఆక్సిజన్ బెడ్లపైనా, 367 మంది ఐసీయూల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

వేగంగా వాక్సినేషన్

తెలంగాణలో ఇప్పటి వరకు 7 లక్షల 49 వేల 197 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ రికార్డులు చెబుతున్నాయి. జనవరి 16వ తేదీన మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణవ్యాప్తంగా మార్చి 13న ఒక్కరోజే 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలసి మొత్తం 2,15,980 మంది టీకా వేయించుకున్నారని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొదటి డోస్‌ టీకా తీసుకున్నవారు 5,27,117 మంది కాగా, రెండో డోస్‌ టీకా తీసుకున్నవారు 2,22,080 మంది ఉన్నారు. అంటే మొత్తం మొదటి, రెండో డోస్‌ టీకాల సంఖ్య 7,49,197కు చేరింది. ఇక శనివారం 60 ఏళ్లు పైబడిన 10,539 మందికి, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో 7,793 మందికి మొదటి డోస్‌ టీకా ఇచ్చారు. ఇటు 753 మంది వైద్య సిబ్బంది, 474 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కూడా శనివారం మొదటి డోస్‌ టీకా ఇచ్చారు. అలాగే ఈ ఒక్కరోజులో 165 మంది వైద్య సిబ్బందికి, 2,693 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు రెండో డోస్‌ టీకా వేశారు. ఇలా ఒక్కరోజులో మొదటి, రెండో డోస్‌ టీకా పొందినవారు 22,417 మంది ఉన్నారు.

ALSO READ: ఏపీలో తిరుగులేని వైసీపీ.. మరింతగా పడిపోయిన విపక్షాల బలం.. టీడీపీ ఓట్ల శాతంలో భారీ తరుగుదల