Defence Budget 2025: రక్షణ రంగానికి రూ. 6.81 లక్షల కోట్లు.. గతేడాది కంటే ఎంత పెరిగిందంటే?
India Defence Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ.6,81,210 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రక్షణ శాఖకు కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గతేడాది రక్షణ శాఖకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,21,940 కోట్లు కేటాయించింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే రక్షణ రంగ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ.6,81,210 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గతేడాది(బడ్జెట్ 2024) రక్షణ రంగ కేటాయింపులు రూ.6,21,940 కోట్లుగా ఉంది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ సారి రక్షణ బడ్జెట్ 9 శాతం పెరగడం విశేషం. బడ్జెట్‌లో మొత్తం రక్షణ మూలధన వ్యయం రూ.1,92,387 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో పింఛను కోసం రూ.1,60,795 కోట్లు కలిపి రెవెన్యూ వ్యయం రూ.4,88,822 కోట్లుగా ఉంచారు. మూలధన వ్యయం కింద ఎయిర్‌క్రాఫ్ట్, ఏరో ఇంజన్లకు రూ.48,614 కోట్లు, నావికాదళానికి రూ.24,390 కోట్లు కేటాయించారు. ఇతర పరికరాల కొనుగోలు కోసం రూ.63,099 కోట్లు కేటాయించారు.
గత బడ్జెట్‌లో రక్షణ రంగ కేటాయింపులు ఇలా..
కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి 2023-24 బడ్జెట్‌లో రూ.5.93 లక్షల కోట్లు కేటాయించగా.. 2024-25లో రక్షణ బడ్జెట్ రూ.6.21 లక్షల కోట్లకు పెంచారు. ఫిబ్రవరిలో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్‌లో మొత్తం కేటాయింపుల్లో ఎలాంటి మార్పు లేదు. మధ్యంతర బడ్జెట్‌లో కేవలం రూ.10,000 కోట్లు మాత్రమే మూలధన వ్యయం పెరిగింది.
స్వాతంత్య్రానంతరం రక్షణ రంగంపై వ్యయం ఎంత పెరిగింది?
స్వాతంత్ర్యం తర్వాత దేశం మొదటి బడ్జెట్‌ను 26 నవంబర్ 1947న RK షణ్ముగం చెట్టి సమర్పించారు. ఈ బడ్జెట్ మొత్తం పరిమాణం అంటే మొత్తం వ్యయం ₹197.39 కోట్లుగా అంచనా వేయబడింది. ఈ బడ్జెట్‌లో అత్యధికంగా రక్షణ రంగానికి మాత్రమే కేటాయించారు. స్వతంత్ర భారత తొలి బడ్జెట్‌లో రూ.92.74 కోట్లు అంటే 46% రక్షణ సేవలకు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2013-14 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.2,03,672 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 2013-14తో పోలిస్తే గత బడ్జెట్ 2024-25లో మోదీ ప్రభుత్వ రక్షణ బడ్జెట్ కేటాయింపులు రెండింతలు పెరిగాయి.
చైనా బడ్జెట్ మన బడ్జెట్ కంటే ఎక్కువ
రక్షణ వ్యయంపై ఏప్రిల్ 2024లో విడుదల చేసిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదిక ప్రకారం 2023లో అత్యధికంగా సైనిక వ్యయం చేస్తున్న టాప్ 10 దేశాలలో భారతదేశం $83.6 బిలియన్ల వ్యయంతో నాల్గవ స్థానంలో ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే.. చైనా 296 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్ రెండవ స్థానంలో ఉంది. భారత్ రక్షణ బడ్జెట్ చైనా రక్షణ బడ్జెట్‌లో మూడింట ఒకటో వంత మాత్రమే ఉంది..