Viral: రాత్రిపూట వరుసగా మిస్డ్ కాల్స్, మెసేజ్‌లు.. తెలియని నెంబర్లని వదిలేశాడు.. తీరా చూస్తే..
తాజాగా ఓటీపీ అవసరం లేకుండా మిస్డ్‌కాల్‌తో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి లక్షల రూపాయల..
టెక్నాలజీ పెరిగే కొద్దీ.. సైబర్ నేరాల తీరు కూడా రోజురోజుకీ మారిపోతోంది. తాజాగా ఓటీపీ అవసరం లేకుండా మిస్డ్‌కాల్‌తో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి లక్షల రూపాయల నగదు కాజేశాడు. దేశ దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సెక్యూరిటీ సర్వీస్ సంస్థను నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సదరు వ్యక్తి ఫోన్‌కు రాత్రి సమయంలో పలుమార్లు మిస్డ్‌కాల్స్ వచ్చాయి. వాటిలో కొన్ని కాల్స్‌ను లిఫ్ట్ చేయగా అవతలి నుంచి ఎవరు మాట్లాడకపోవడంతో, తర్వాత వచ్చిన వాటి గురించి అతడు పెద్దగా పట్టించుకోలేదు.
కొద్ది సమయం తర్వాత తన బ్యాంకు ఖాతా నుంచి ఆర్‌టీజీఎస్ ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో షాకయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో మొత్తంగా 50 లక్షల రూపాయలు సైబర్ కేటుగాళ్లు కొట్టేసినట్టు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ మోసానికి పాల్పడింది ఝార్ఖండ్‌లోని జాంతారా ప్రాంతానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. స్విమ్ స్వాప్ ద్వారా బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి నగదు కొట్టేసినట్లు తేల్చారు. బ్లాంక్ లేదా మిస్డ్‌కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఆర్‌టీజీఎస్‌కు చెందిన ఓటీపీని యాక్టివేట్ చేసి, ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా వాటిని పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. జనం కొత్త నెంబర్లతో వచ్చే మిస్ట్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.