I-T searches: ఐటీ సోదాల కలకలం.. 50కి పైగా వ్యాపారులు, కాంట్రాక్టర్ల నివాసాల్లో ఏకకాలంలో దాడులు
బెంగళూరులో ఈ ఉదయం ఒక్కసారిగా ఐటీ సోదాల కలకలం రేగింది. ఏకకాలంలో 50కి పైగా ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు.
Bangalore I-T searches: బెంగళూరులో ఈ ఉదయం ఒక్కసారిగా ఐటీ సోదాల కలకలం రేగింది. ఏకకాలంలో 50కి పైగా ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. యడ్యూరప్ప సన్నిహితుడి నివాసం సహా పలువురు వ్యాపారులు, కాంట్రాక్టర్ల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి.
ఇలా ఉండగా, తమిళనాడులోనూ ఐటీ దాడుల పరంపర కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కాంచీపురం, వేలూరులలో ఉన్న ప్రముఖ వస్త్ర దుకాణాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తాజాగా సోదాలు చేశారు. ఏక కాలంలో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని నల్లధనాన్ని భారీగా గుర్తించినట్టు తెలుస్తోంది.
కాగా, కాంచీపురం, వేలూరు జిల్లాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఒక వస్త్ర దుకాణం యజమాని భారీ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్టు సమాచారం. దీనికి సంబంధించి కాంచిలోని గాంధీ రోడ్డు, టీకే నంబి వీధిలో ఉన్న ఈ వస్త్ర దుకాణంలో ఈ సోదాలు చేసి, లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు.
అదే విధంగా వేలూరులోని మరో సిల్క్ షోరూమ్‌లో కూడా ఈ సోదాలు చేశారు. అయితే, ఈ దుకాణంలో పనిచేసే సిబ్బందిని ఒక్కరిని కూడా బయటకు పంపించకుండానే తనిఖీలు చేయడం గమనార్హం. షోరూమ్‌తో పాటు క్యాషియర్ రూమ్, బిల్లింగ్ సెక్షన్, షోరూమ్ గోదాముల్లో తనిఖీలు చేశారు. ఇదిలావుంటే, కాంచీపురం రంగస్వామి కోనేరు వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 54 మంది అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు, ఇవాళ హైదరాబాద్ శ్రీకృష్ణ జ్యువెలర్స్‌లో ఈడీ సోదాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు గుర్తించిన ఈడీ. శ్రీకృష్ణ జ్యువెలర్స్‌పై గతంలోనే సీసీఎస్‌లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీసీఎస్ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.