IMD Alert: మరో ఉపద్రవం ముంచుకొస్తుందా..? దేశంలోని పలు ప్రాంతాలకు కుండపోత వర్షాల గండం..!
IMD Weather Update: వయనాడ్ ఉపద్రవం ఇంకా మరవకముందే, ఇప్పుడు మరో ముప్పు ముంచుకొస్తోంది. భారత వాతావరణ శాఖ తాజాగా కేరళ నుంచి కాశ్మీర్ వరకు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షసూచన ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి ఈ ముప్పు ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు సంభవించే అవకాశాలు, కొండచరియలు జారిపడే ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Heavy Rains Alert in India: వర్షం.. ప్రకృతి ప్రసాదించిన వరం. ఈ వర్షం కోసం యజ్ఞయాగాదులు, పూజలు, మేఘమథనాలు జరిగాయి. కానీ ఇప్పుడు వరంలాంటి వర్షమే శాపంగా మారుతోంది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. జలప్రళయంతో విలయాన్ని సృష్టిస్తోంది. అందుకే వర్షం కురుస్తుంది అంటే సంతోషంగా చిందులు వేయాల్సిన రోజులు పోయి, అమ్మ బాబోయ్ అనుకుంటూ గడపాల్సిన పరిస్థితులు వచ్చాయి. భూతాపం పెరగడం, వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రకృతిలో సమతుల్యత దెబ్బతిన్నది. ఫలితంగా నెలరోజుల్లో కురవాల్సిన వర్షాలు వారం రోజుల్లో కురుస్తున్నాయి. వారం రోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్క రోజులో, ఒక్క రోజులో కురవాల్సిన వర్షం ఒక్క గంటలో కురుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా వయనాడ్ ఉపద్రవం ఇంకా మరవకముందే, ఇప్పుడు మరో ముప్పు ముంచుకొస్తోంది. భారత వాతావరణ శాఖ తాజాగా కేరళ నుంచి కాశ్మీర్ వరకు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షసూచన ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి ఈ ముప్పు ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు సంభవించే అవకాశాలు, కొండచరియలు జారిపడే ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రంతో పాటు, ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రాంతాలవారిగా చేసిన ఆ హెచ్చరికలను ఓసారి గమనిస్తే…
వాయువ్య భారతదేశం
భారతదేశానికి ఉత్తర, వాయువ్య దిశల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో సైతం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడా అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్ట్ 20, 21 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మొత్తంగా రానున్న 3-4 రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో జనజీవనంపై వర్షాలు ప్రభావం చూపనున్నాయి.
పశ్చిమ, మధ్య భారతదేశం
దేశంలోని పశ్చిమ, మధ్య భాగాల్లో ఉన్న విదర్భ, మరఠ్వాడ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని కూడా అంచనా వేసింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వరదలు సంభవిస్తాయని వెల్లడించింది.
తూర్పు, ఈశాన్య భారతదేశం
తూర్పు, ఈశాన్య భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం (నేడు) ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది
దక్షిణ ద్వీపకల్ప భారతదేశం
దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్ఛేరి, కోస్తాంధ్రతో పాటు తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళ, తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల్లో ముప్పు పొంచి ఉందని తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదై వరదలకు ఆస్కారం కల్పిస్తాయని హెచ్చరించింది.