అస్థిపంజరం దొరికితే.. భర్తే చంపాడని జైలు శిక్ష వేశారు! తీరా చూస్తే అతని భార్య రెస్టారెంట్‌లో..
సురేష్ అనే వ్యక్తి తన భార్య మల్లిగే కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం, మహిళా అస్థిపంజరం కనుగొనబడి, సురేష్‌ను హత్యకు అరెస్టు చేశారు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత, DNA పరీక్షల్లో అస్థిపంజరం మల్లిగేది కాదని తేలింది. అనూహ్యంగా, మల్లిగే ఒక రెస్టారెంట్‌లో కనిపించడంతో సురేష్ నిర్దోషిగా తేలి, పోలీసుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.

భార్యను హత్య చేశాడని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి జైలు శిక్ష కూడా విధించింది. ఓ రెండేళ్లు జైలు శిక్ష విధించిన తర్వాత ఆ వ్యక్తి బెయిల్‌పై బయటికి కొచ్చాడు. అతను బెయిల్‌పై బయటికి వచ్చిన ఓ ఏడాదికి అతని భార్య ఓ రెస్టారెంట్‌లో జాలీగా భోజనం చేస్తూ కనిపించింది. దీంతో అతను నిర్దోషిగా తేలాడు. వింటుంటే సినిమా కథలా అనిపిస్తున్నా.. ఇది రియల్‌గా జరిగింది. కర్ణాటకలోని కొడగు జిల్లా కుశాల్నగర్ తాలూకాలోని బసవనహళ్లి నివాసి సురేష్ అనే వ్యక్తి 2021లో తన భార్య మల్లిగే కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఒక సంవత్సరం తరువాత, పొరుగున ఉన్న మైసూరు జిల్లాలోని బెట్టడపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అస్థిపంజర అవశేషాలు లభించాయి. ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో, పోలీసులు అది మల్లిగే అని అనుమానించారు. DNA టెస్టులు ఏం చేయకుండానే.. అది మల్లిగే అస్థిపంజరమే అంటూ సురేష్ పై హత్యా నేరం మోపి అతన్ని జైలుకు పంపారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అయితే కోర్టు ఆదేశాల మేరకు దొరికి అస్థిపంజరానికి DNA పరీక్ష చేయగా.. అది మల్లిగే అస్థిపంజరం కాదని తేలింది.
దీంతో సురేష్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది జరిగా సరిగ్గా ఏడాది మల్లిగేను మడికేరిలోని ఒక రెస్టారెంట్‌లో సజీవంగా, ఆరోగ్యంగా, భోజనం చేస్తుండగా సురేష్ స్నేహితుడు చూసి గుర్తుపట్టాడు. వెంటనే ఆమెను తీసుకుని బెట్టడపుర పోలీసులు వద్దకు తీసుకెళ్లాడు. పోలీసులు ఆమెను మైసూరు కోర్టులో హాజరుపరిచారు. దీంతో సురేష్ నిరపరాధిగా బయటపట్టాడు. అయితే.. పోలీసులు ఈ కేసును నిర్లక్ష్యంగా విచారించడంతోనే పాపం సురేష్ రెండేళ్లు జైలు శిక్ష అనుభించాల్సి వచ్చింది. మరి దీనిపై కోర్టు పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.