Surya Ghar: ఇంటిపై సోలార్ ప్యానల్స్.. సూర్య ఘర్ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
కోటి మంది కుటుంబాలకు లబ్ధి చేకూరేలా కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా జరిగి కేబినేట్ సమావేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు పొందడానికి సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కోసం కేంద్రం రూ. 75,021 కోట్లు కేటాయించింది...

దేశంలో గృహాలకు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా అర్హులైన వారికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నారు.
కోటి మంది కుటుంబాలకు లబ్ధి చేకూరేలా కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా జరిగి కేబినేట్ సమావేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు పొందడానికి సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కోసం కేంద్రం రూ. 75,021 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింది రాయతీని రెండు భాగాలుగా విభజించారు. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు. మూడు కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్ఠంగా రూ.78 వేలు అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా పొందొచ్చు. ఎలాంటి పుచీకత్తు లేకుండా ఈ రుణాన్ని అందిస్తారు.
ఇదిలా ఉంటే ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా కేవలం గృహ అవసరాలకు కరెంట్‌ను వాడుకోవడమే కాకుండా కరెంట్‌ను విక్రయించుకునే అవకాశం కూడా ఉంది. తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లు నెట్ మీటరింగ్ ద్వారా అమ్ముకోవచ్చు. దీంతో నెలకు రూ. 1265 ఆదాయంగా పొందొచ్చు వీటిలో రూ. 610 తీసుకున్న లోన్‌కి బ్యాంకు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు.
ఎలా అప్లై చేసుకోవాలంటే..
* ఈ పథకాన్ని తీసుకోవాలంటే ముందుగా పీఎం సూర్యఘర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో భాగంగా మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేస్తున్న కంపెనీ పేర్లను సెలక్ట్ చేసుకోవాలి. అలాగే మీ విద్యుత్ కనెక్షన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు అందించాలి.
* అనంతరం మీ కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ‘రూఫ్‌టాప్ సోలార్’ అప్లై చేసుకోవాలి.
* తర్వాత అప్లికేషన్ ఫామ్‌ను నింపిన తర్వాత డిస్కమ్ నుంచి పర్మిషన్ వచ్చే వరకు చూడాలి. పర్మిషన్ వచ్చి వెంటనే మీ డిస్కమ్‌లో పేర్కొన్న వారి నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
* ప్యానెల్స్‌ను ఇంటిపై ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలి.
* ఇక నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు. తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.
* ఈ సర్టిఫికేట్ పొందిన తర్వాత.. తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. 30 రోజుల్లో మీ ఖాతాలోకి సబ్సిడీ మొత్తం జమ అవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..