Women Reservation Bill: మహిళా రిజర్వేషన్లు అమలైతే.. ఏ వర్గానికి ఎన్ని సీట్లు దక్కుతాయో తెలుసా..
Women Reservation: దేశంలో చట్టసభల్లో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్‌ను రాజ్యాంగం కల్పించింది. రెండు వర్గాలకు కలిపి సుమారు 24% రిజర్వేషన్ అమలవుతోంది. మరి ఇంతకీ ఈ బిల్లు అమలైతే.. సమాజంలో ఏ వర్గం మహిళలకు ఎన్ని సీట్లు వస్తాయి? చట్టసభల్లో ఇప్పటికే అమలవుతున్న షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) రిజర్వేషన్లలో కూడా ఈ మహిళా రిజర్వేషన్లు వర్తిస్తాయా? మరి అలాంటప్పుడు మొత్తం 33 శాతం రిజర్వేషన్లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు దక్కుతాయి? న్యాయనిపుణులు ఏమంటున్నారు..

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళా రిజర్వేషన్ల గురించే చర్చ జరుగుతోంది. కొత్త పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లుగా 108వ రాజ్యాంగ సవరణ బిల్లు (మహిళా రిజర్వేషన్ల బిల్లు) ప్రవేశపెట్టడంతో రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయ నిపుణులు ఇదే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. మరి ఇంతకీ ఈ బిల్లు అమలైతే.. సమాజంలో ఏ వర్గం మహిళలకు ఎన్ని సీట్లు వస్తాయి? చట్టసభల్లో ఇప్పటికే అమలవుతున్న షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) రిజర్వేషన్లలో కూడా ఈ మహిళా రిజర్వేషన్లు వర్తిస్తాయా? మరి అలాంటప్పుడు మొత్తం 33 శాతం రిజర్వేషన్లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు దక్కుతాయి? న్యాయనిపుణులు ఏమంటున్నారు…
దేశంలో చట్టసభల్లో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్‌ను రాజ్యాంగం కల్పించింది. రెండు వర్గాలకు కలిపి సుమారు 24% రిజర్వేషన్ అమలవుతోంది. లోక్‌సభ గణాంకాలను చూస్తే మొత్తం ఎన్నికలు జరిగే 543 నియోజకవర్గాల్లో 84 సీట్లు ఎస్సీలకు, 47 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. ఈ రెండు వర్గాలకు కలిపి 131 సీట్లు రిజర్వ్ అవగా.. మిగిలిన 412 సీట్లను జనరల్ కేటగిరీగా పేర్కొంటున్నాం. రిజర్వ్ స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన నేతలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. జనరల్ సీట్లలో ఎవరైనా పోటీ చేయవచ్చు. ఇప్పుడు కొత్తగా 33% సీట్లను మహిళలకు రిజర్వు చేస్తే.. ఇప్పటికే అమలవుతున్న 24% ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అదనంగా ఈ 33% కలిస్తే మొత్తం రిజర్వేషన్లు 57%కు చేరతాయి.
అప్పుడు జనరల్ కేటగిరీలో కేవలం 43 శాతం సీట్లు మాత్రమే మిగులుతాయి. ఇలా చేస్తే.. మహిళా రిజర్వేషన్లు కేవలం అగ్రవర్ణాల మహిళలకే తప్ప ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత స్థానం దొరకదు. అది రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశాన్నే దెబ్బతీస్తుంది. అందుకే మహిళా రిజర్వేషన్లను ఈ పద్ధతిలో అమలు చేయరని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో మిళితమై మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని వివరిస్తున్నారు. అంటే ఇప్పటికే అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో మూడో వంతు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అదేమాదిరిగా మిగిలిన జనరల్ సీట్లలో కూడా మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తారు. అలా మొత్తంగా 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.
ఉదాహరణకు లోక్‌సభనే పరిగణలోకి తీసుకుంటే.. 543 స్థానాల్లో ఎస్సీలకు రిజర్వు చేసిన 84 సీట్లలో 33% అంటే 28 సీట్లు మహిళలకు దక్కుతాయి. అలాగే ఎస్టీలకు రిజర్వు చేసిన 47 సీట్లలో ఆ వర్గం మహిళలకు 16 సీట్లు దక్కుతాయి. మిగిలిన జనరల్ సీట్లు 412లో కూడా 33% సీట్లు మహిళలకు రిజర్వు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన 137 సీట్లు జనరల్ కేటగిరీ మహిళలకు రిజర్వు అవుతాయి. ఆ లెక్కన మొత్తం 543 సీట్లలో 181 సీట్లు మహిళలకు రిజర్వు అవుతాయి. అందులో ఎస్సీ మహిళలు 28 మంది, ఎస్టీ మహిళలు 16 మంది, జనరల్ కేటగిరీ మహిళలు 137 మంది ఉంటారు. అంటే మహిళా ప్రాతినిథ్యంలో కూడా సామాజిక సమతౌల్యం ఉండేలా ఈ రిజర్వేషన్లు అమలవుతాయి.
ఇదే ఫార్ములా దేశంలోని అన్ని అసెంబ్లీలకు వర్తిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మహిళా రిజర్వేషన్లు కేవలం ప్రజలు నేరుగా ఎన్నుకునే చట్టసభలు (లోక్‌సభ, శాసనసభ)కు మాత్రమే వర్తిస్తాయి. పెద్దల సభగా చెప్పుకునే రాజ్యసభతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఉన్న శాసన మండలిలో ఏ రిజర్వేషన్లు వర్తించవు. అంటే అక్కడ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లూ ఉండవు. మహిళా రిజర్వేషన్లు కూడా ఉండవు. అలాగని అక్కడ మహిళలకు ప్రవేశం నిషేధం అని కాదు. కాకపోతే ఆయా రాజకీయ పార్టీలు తమ విచక్షణతో ఎంత మంది మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలి అనుకుంటే అంతమందికి అక్కడ అవకాశం కల్పించవచ్చు.
మహిళా రిజర్వేషన్లు అమలైతే లోక్‌సభలో కనీసం 181 మంది మహిళలు (జనరల్, ఎస్సీ, ఎస్టీ కలిపి) అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన జనరల్ కేటగిరీలో సీట్లలో ఎక్కడైనా మహిళలు పోటీ చేసి గెలుపొందితే.. వారు ఈ 181కి అదనం. ఒకవేళ మహిళా రిజర్వేషన్లు అమలయ్యే నాటికి లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగితే.. ఆ మేరకు మూడు కేటగిరీల మహిళల సంఖ్య కూడా పెరుగుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం




