TV9 Satta Sammelan: ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నాం.. గుజరాత్ ఎన్నికల వేళ అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
వచ్చే నెలలో రెండు విడతల్లో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ పలు అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో విజయం సాధించడం ద్వారా మరో రికార్డు సృష్టించబోతున్నట్లు..

వచ్చే నెలలో రెండు విడతల్లో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ పలు అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో విజయం సాధించడం ద్వారా మరో రికార్డు సృష్టించబోతున్నట్లు తెలిపారు. టీవీ9 నిర్వహించిన సత్తా సమ్మేళనంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ తమకు పోటీదారే కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు పోటీ కానప్పటికి.. గుజరాత్‌లో ఆపార్టీకి పునాది ఉందని, 30 నుంచి 35 శాతం ఓటు బ్యాంకు ఉందన్నారు. గుజరాత్‌లో త్రిముఖ పోటీపై స్పందిస్తూ.. గతంలో కూడా ఇదే ప్రచారం సాగిందని, చిమన్ భాయ్ పటేల్ కిసాన్ మజ్దూర్ లోక్ పక్ష పార్టీని స్థాపించారని, తర్వాత శంకర్‌సింగ్ వాఘేలా, మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కూడా పార్టీలు పెట్టినప్పటికి ఏ పార్టీ కూడా ప్రభావం చూపలేకపోయాయన్నారు. గుజరాత్‌లో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే అని అమిత్ షా స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి పెద్ద సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. వీర సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందిస్తూ.. రాహుల్‌కి ఇతిహాసాల మీద ఏమాత్రం అవగాహన లేదన్నారు.
దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పోరాటం ప్రారంభించక ముందే బ్రిటీషర్లపై సావర్కర్ పోరాడారని తెలిపారు. ఈ విషయంపై ఆయనకు కనీస అవగాహన లేదన్నారు అమిత్ షా. రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన మొదటి పుస్తకం సావర్కర్ పుస్తకమని అమిత్ షా తెలిపారు.
మహారాష్ట్రలో భారత్ జోడో యాత్రలో గాంధీ వెంట నడిచిన సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. గుజరాత్‌ను, దాని సమస్యలను కించపర్చే వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలతో సహవాసం చేసే వారిని గుజరాత్ ప్రజలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి, రామజన్మభూమిపై అంశాలపై పార్టీ అభిప్రాయం స్థిరంగా ఉందని చెప్పారు. ఆర్టికల్ 370, రామజన్మభూమి అంశాలపై దేశ ప్రజలు ఎలాంటి మద్దతు ఇచ్చారో ఉమ్మడి పౌరస్మృతి విషయంలో కూడా అదే మద్దతు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..



