Rain in India: ఉత్తరాదిలో కుండపోత! ఉప్పొంగుతున్న నదులు.. ఆ రాష్ట్రాల్లో 15 మంది మృతి

భారీ వర్షాలకు ఉత్తరం విలవిలలాడుతోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని గురుగ్రామ్, హర్యానా, ప్రయాగ్‌రాజ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, వరద నీటితో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుగ్రామ్‌లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై భారీ ఎత్తున నీరు నిలిచింది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు మిట్ట మధ్యాహ్నం లైట్లు వేసుకొని వెళ్తున్నారు. పశ్చిమ హిమాలయ ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతంలో మరో ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.

Rain in India: ఉత్తరాదిలో కుండపోత! ఉప్పొంగుతున్న నదులు.. ఆ రాష్ట్రాల్లో 15 మంది మృతి
Rains In India
Follow us

|

Updated on: Aug 12, 2024 | 12:26 PM

భారీ వర్షాలకు ఉత్తరం విలవిలలాడుతోంది. చిగురుటాకులా వణికిపోతుంది. గురుగ్రామ్ జల్‌గ్రామ్‌గా మారిపోయింది. ప్రయాగ్‌రాజ్‌లో అనేక ప్రాంతాలు ప్రమాదపుటంచున ఉన్నాయి. ఢిల్లీలో ఎడతెరిపి లేని వర్షం దినదిన గండంగా మారింది. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సిఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అంతకుముందు, వాతావరణ శాఖ కూడా ఢిల్లీలో వర్షం కారణంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఢిల్లీ, నోయిడాలోని పలు ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు ఆవరించి భారీ వర్షం కురిసింది.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఆగస్టు నెల ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఈ వర్షాలు మరింతగా పెరిగాయి. ఢిల్లీ-నోయిడా, ఘజియాబాద్‌లలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా కొన్ని సొసైటీల్లో కరెంటు, నీటి సమస్య కూడా ప్రజలను ఇబ్బంది పెట్టింది. చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ నదులుగా మారి కాలినడకన, వాహనాల్లో వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది.

ఇవి కూడా చదవండి

గురుగ్రామ్‌లో 53 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. హీరో హోండా చౌక్ నుంచి సైబర్ పార్క్ వరకు అన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. గురుగ్రామ్‌లోని చాలా రోడ్లు, ముఖ్యంగా నివాస ప్రాంతాలలో మోకాళ్ల స్థాయి వరకు నీటితో నిండిపోయాయి. దీంతో వాహనాలతో పాటు ప్రజలు కాలినడకన వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. సెక్టార్ 85లోని సతీ చౌక్ నుంచి శీతల మాత ఆలయం వరకు ఇదే పరిస్థితి. సిటీ బస్సుల్లోకి నీళ్లు వస్తున్నాయి. పరిస్థితి అంచనా వేసి కొన్ని సబ్ వేలను ముందుగానే మూసివేశారు. ఎమర్జెన్సీ మాన్‌సూన్ టీమ్స్‌ నీటిని తొలగించే పనిలో ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేని కారణంగా ఈ స్థాయిలో నీరు వరద రోడ్లపై నిలుస్తుందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా పలు చోట్ల అప్రమత్తం

గత రెండు మూడు రోజులుగా దాదాపు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు రాజస్థాన్‌లో ఆదివారం వర్షం కురవడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాలన్నింటిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, కొట్టుకుపోతున్న వంతెనలు

భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక పెద్ద, చిన్న నదులు ఉప్పొంగుతున్నాయి. చాలా నదులు ప్రమాద స్థాయికి చేరువలో ఉన్నాయి. నదులపై నిర్మించిన వంతెనలు కూడా చాలా చోట్ల విరిగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వర్షం ఇప్పట్లో ఆగేలా లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 12వ తేదీన ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో సహా మొత్తం ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇందులో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 13 నుంచి కొన్ని ప్రాంతాల్లో కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి.

పంజాబ్‌లో ఘోర ప్రమాదం

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని జైజ్‌లో ఓ వాహనం ఛోటీ పర్సతి నదిలో పడి 9 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా నుండి పంజాబ్‌లోని ఎస్‌బిఎస్ నగర్‌లోని ఒక గ్రామానికి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబం వెళుతోంది. వంతెనపై నీరు ఉండటంతో వాహనం చిన్న నదిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందారు. బ్రిడ్జిపైకి వాహనంతో వెళ్లొద్దని అక్కడ నిలబడిన కొందరు వారించారు. అయినా ఆ హెచ్చరికలను డ్రైవర్ పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పంజాబ్‌లోని జైజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం భగవంత్ మాన్, బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.4 లక్షల సాయం ప్రకటించారు.

రాజస్థాన్‌లో ఏడుగురు నీట మునిగి మృతి

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని బంగంగా నది దిగువ ప్రాంతంలోని నాగ్లా హోట్టా (శ్రీ నగర్) గ్రామంలో ఆదివారం పెద్ద ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా బంగంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది పక్కనే కట్టిన ప్లాట్ ఫాంపై కొందరు నిలబడి నది ప్రవాహాన్ని చూస్తున్నారు. ప్రవాహాన్ని చూస్తుండగా ఒక్కసారిగా ఒడ్డు ఒకటిన్నర కిందకి కూరుకుపోవడంతో కొందరు నదిలో పడ్డారు. బలమైన ప్రవాహం కారణంగా నీటిలో పడిన ప్రజలు ఒడ్డుకు చేరుకోలేకపోయారు. దీంతో ఇప్పటి వరకు నదిలో నుంచి 7 మంది మృతదేహాలను బయటకు తీశారు.

బీహార్‌లో ముగ్గురు మరణం

బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని మఝౌవా విమానాశ్రయానికి సమీపంలో ఓ గొయ్యి నీటితో నిండిపోయింది. భారీ వర్షం కారణంగా గొయ్యి నీటితో నిండిపోయింది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు స్నానానికి వెళ్లి గొయ్యిలో పడి మృతి చెందారు. తన సంతాపాన్ని వ్యక్తం చేసిన సీఎం నితీశ్, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల సాయం ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..