PM Narendra Modi: సాధారణ మహిళపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ.. నేనైతే పార్టీ టికెట్ ఇచ్చే వాడిని అంటూ..
న్యూస్9తో ప్రత్యేకంగా మాట్లాడిన సంతోషి.. ప్రధాని మోడీ ప్రశంసించడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. సంతోషి మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. మోడీ ఇలా చెప్పడం సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు.
PM Modi praise Woman: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడూ కూడా హుందాగా వ్యవహరించడమే కాకుండా.. ప్రజలతో నేరుగా సంభాషిస్తుంటారు. అలాంటి క్రమంలో వారి ప్రతిభను చూసి ప్రశంసలు కురిపిస్తుంటారు. తాజాగా.. కేంద్ర పథకాల లబ్ధిదారులతో ముచ్చటించిన ప్రధాని మోడీ.. ఓ మహిళ అభిప్రాయాలను విని ముగ్ధులయ్యారు. మే 31, మంగళవారం దేశవ్యాప్తంగా కేంద్ర పథకాల లబ్ధిదారులతో జరిగిన వర్చువల్ ఇంటరాక్షన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన సంతోషి అనే మహిళతో సంభాషించారు. అయితే.. సంతోషి మాటాలను విన్న మోడీ తన నైపుణ్యాలను ప్రశంసించారు. సంతోషి తన అభిప్రాయాలను వెల్లడించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని, తాను స్థానిక నాయకుడైతే ఎన్నికల్లో పోటీ చేయమని ఆమెను కోరేవాడినని.. ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో సంతోషి మాట్లాడుతూ.. తన తల్లి నీలమ్మ బిపి, మధుమేహంతో బాధపడుతుందని.. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధి జెనరిక్ ఔషధాల కింద ఉచిత వైద్యం లభించందంటూ పేర్కొంది. అయితే.. సంతోషి కన్నడలో మాట్లాడినప్పటికీ.. ఆమె వక్తృత్వ నైపుణ్యానికి ముగ్ధుడైన మోడీ.. ఆమె అద్భుతమైన నాయకురాలిగా తయారయ్యేదంటూ పేర్కొన్నారు. ‘‘మీరు కన్నడలో మాట్లాడటం చూసి నేను సంతోషిస్తున్నాను. నేను బీజేపీకి కార్యకర్తగా ఉండి ఉంటే.. పథకం ప్రయోజనం, మీ గ్రామం మొత్తం సంక్షేమం గురించి మీ ప్రసంగం ద్వారా ప్రచారం చేసి.. నేను మిమ్మల్ని ఎన్నికల్లో పోటీ చేసేలా చేసేవాడిని..’’ అంటూ పేర్కొన్నారు.
అనంతరం న్యూస్9తో ప్రత్యేకంగా మాట్లాడిన సంతోషి.. ప్రధాని మోడీ ప్రశంసించడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. సంతోషి మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. మోడీ ఇలా చెప్పడం సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు. ‘‘ప్రధానమంత్రి మోడీ నాకు హిందీలో చెప్పారు.. ఆయన స్థానిక రాజకీయ నాయకుడిగా ఉంటే నన్ను పోటీ చేయిస్తానని చెప్పారు.. ఆయన అలా చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.’’ అంటూ పేర్కొన్నారు.
అవకాశం వస్తే పోటీకి సిద్ధమని, ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉందని ఆమె తన మనసులోని అభిప్రాయాన్ని వెల్లడించారు.
తాను చిన్నపాటి బీజేపీ కార్యకర్త అయినప్పటికీ ప్రజలకు తన వంతు సాయం చేశానని సంతోషి చెప్పుకొచ్చారు.
‘‘నా సామాజిక సేవల కారణంగా.. నేను 2016లో గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. కోవిడ్ సమయంలో కార్డు హోల్డర్లకు ప్రయోజనాలను అందించే కార్మికుల కోసం తయారు చేసిన 450 కార్డులను ఇప్పించాను.. వృద్ధాప్య పింఛను ఉన్నవారికి కూడా నేను సహాయం చేశాను..’’ అంటూ పేర్కొన్నారు.
‘‘నేను చాలా బాగా మాట్లాడానని స్థానిక రాజకీయ నాయకుడు నాతో చెప్పారు.. ప్రజలకు సేవ చేసే పార్టీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను.’’ అంటూ తెలిపారు.
కేంద్ర పథకాల ప్రయోజనాల గురించి మాట్లాడుతూ.. ఒక చిన్న కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్న సంతోషి, ఉచిత చికిత్స తన కుటుంబానికి ఎంతో సహాయపడిందని చెప్పారు.
‘‘మా అమ్మ ఆరోగ్యం కోసం ఆసుపత్రి బిల్లులు, రాకపోకలు, మందులతో సహా ప్రతి నెలా కనీసం రూ. 3000 ఖర్చు చేస్తాం. ఈ ప్రభుత్వ ఆరోగ్య పథకాల గురించి తెలుసుకున్నప్పుడు నేను మా అమ్మను అక్కడికి తీసుకువెళ్లాను. ఆమెకు బిపి, షుగర్ వ్యాధికి ఉచితంగా వైద్యం అందించి మందులు అందించారని’’ తెలిపారు.
‘‘నాకు చిన్న కిరాణా దుకాణం ఉంది.. నాకు పొలం లేదు.. మేము పేదవాళ్లం. ఈ ఉచిత చికిత్స మాకు నిజంగా సహాయపడింది.. ఎందుకంటే ప్రతి నెల రూ.3000 ఆదా చేయడం చాలా పెద్ద విషయం.. ఆ డబ్బును నా పిల్లల చదువుకు ఉపయోగించగలను’’ అంటూ ఆమె పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..