Navjot Sidhu Sidhu: వారిని బహిరంగంగా ఉరితీయాలి.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ డిమాండ్
Navjot Sidhu Sidhu: పంజాబ్‌లో సిక్కుల ప్రార్థనామందిరాలపై జరగుతున్న దాడులపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Punjab Elections 2022: పంజాబ్‌లో సిక్కుల ప్రార్థనామందిరాలపై జరగుతున్న దాడులపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ , ముస్లిం , సిక్కుల పవిత్ర గ్రంథాలను , ప్రార్ధనా మందిరాలను టార్గెట్ చేసే వారిని బహిరంగంగా ఉరితీయాలని సిద్దూ డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో పంజాబ్‌లో రెండు ప్రార్థనా మందిరాలపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. స్వర్ణదేవాలయంతో పాటు కపూర్తాలా లోని గురుద్వారాను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని స్థానికులు దాడి చేసి చంపేసిన ఘటనలు సంచలనం సృష్టించాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించే విషయంలో ఆ రాష్ట్ర రాజకీయ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ప్రార్థనా మందిరాలను అపవిత్రం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఖండించిన పంజాబ్ సీఎం చన్నీ.. అయితే ఇద్దరు వ్యక్తులను దాడి చేసి చంపేసిన ఘటనలపై మాత్రం స్పందించలేదు.
కాగా సున్నితమైన ఈ అంశంపై స్పందించిన సిద్ధూ.. ప్రార్థనా మందిరాలను అపవిత్రం చేయడం ద్వారా ప్రజల మనోభావాలు తీవ్రంగా గాయపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రార్థనా మందిరాలను అపవిత్రం చేసే వారిని బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. ఓ మతానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పంజాబ్‌లో శాంతికి విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తిలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
గురుద్వారాలను అపవిత్రం చేసే ప్రయత్నాల నేపథ్యంలో పంజాబ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. గురుద్వారాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. స్వర్ణదేవాలయంతో పాటు కపూర్తాలా లోని గురుద్వారాను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని స్థానికులు దాడి చేసి చంపేసిన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. అలాగే కపూర్తలా గురుద్వారా ఘటనకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కపుర్తలా ఘటన గురుద్వారాను అపవిత్రం చేసేందుకు జరిగిన ప్రయత్నం కాదని.. దొంగతనం చేసేందుకు వచ్చిన వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
అటు గురుద్వారాలను అపవిత్రం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సిక్కు మత సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. గురుద్వారాలకు పటిష్ట భద్రత కల్పించడంతో పాటు.. ఇలాంటి ఘటనలు పునరావతృం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read..
Viral Video: పెను ప్రమాదం నుంచి ఎలుకను కాపాడిన కాకి..! మీరే చూడండి
కొత్త జంటకు సూపర్ గిఫ్ట్ !! ట్విస్ట్ తెలిస్తే నవ్వులే నవ్వులు.. వీడియో