Parliament: ఆధార్‌తో ఓటర్ కార్డు లింక్.. విపక్షాల నిరసనల మధ్య ఆమోదం తెలిపిన లోక్‌సభ

విపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ ఎన్నికల చట్టాల సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021’ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజు సోమవారం నాడు లోక్ సభలో ప్రవేశపెట్టారు.

Parliament: ఆధార్‌తో ఓటర్ కార్డు లింక్.. విపక్షాల నిరసనల మధ్య ఆమోదం తెలిపిన లోక్‌సభ
Aadhaar Voter Id Linking
Follow us

|

Updated on: Dec 20, 2021 | 4:36 PM

Aadhaar-Voter ID linking Bill passed: విపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ ఎన్నికల చట్టాల సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021’ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజు సోమవారం నాడు లోక్ సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలకు దిగడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. చివరికి మధ్యాహ్నం తర్వాత గందరగోళం మధ్యనే బిల్లు పాస్ అయినట్లు ప్రకటన వెలువడింది. బోగస్‌ ఓటింగ్‌ను నిరోధించడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజీజ్‌ మరోసారి స్పష్టం చేశారు.

ఓటరు కార్డును ఆధార్‌నెంబర్‌కు అనుసంధానం చేసే విధంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం వెళ్తుంది. ఈ బిల్లు ద్వారా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్‌ను కోరనుంది ఎన్నికల కమిషన్​. దీంతో పాటు ఇప్పటికే ఓటు హక్కు ఉన్న వారి నుంచి కూడా ఆధార్​ సేకరించేందుకు వీలుంటుంది.

ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానంతోపాటు ఇకపై ప్రతి ఏటా నాలుగు సార్లు ఓటరు నమోదు, మహిళా సర్వీస్ అధికారిణిల భర్తలకూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం, ఎన్నికల కమిషన్ పరిధిని విస్తృతం చేసే కీలక అంశాలను ఈ బిల్లులో పొందుపర్చారు. కాగా, మిగతా మూడు అంశాలపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకున్నా, ఓటరు జాబితాకు ఆధార్ అనుసంధానాన్ని మాత్రం ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి.

వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని.. ఆధార్-ఓటర్ ఐడీ లింక్ తప్పనిసరి ప్రాతిపదికన కాకుండా.. ఐచ్చికంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే తొలగించేలా చర్యలు చేపట్టింది.ఆధార్‌కార్డు కేవలం అడ్రస్‌ ప్రూఫ్‌ మాత్రమే అని , ఓటర్‌ కార్డుతో ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేస్తే దేశ పౌరసత్వం లేని వాళ్లు కూడా ఓటర్లుగా రిజిస్టర్‌ చేసుకునే ప్రమాదముందని బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌. ఓటర్ల జాబితాకు ఆధార్‌ను అనుసంధానం చేయడానికి ఆధార్ చట్టం అనుమతించదని, చట్ట విరుద్ధమైన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని మరో కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి డిమాండ్ చేశారు. ఈ బిల్లును స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి డిమాండ్‌ చేశారు.

ఓటర్‌ ఐడీ – ఆధార్‌ నెంబర్‌ లింక్‌తో వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగుతుందని , సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా బిల్లును తీసుకొచ్చారని విమర్శించారు మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ. దళితులు , మైనారిటీలను టార్గెట్‌ చేసి ఆ వర్గాల ఓట్లను తీసేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. నకిలీ ఓట్లను తొలగించేందుకు , ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొస్తునట్టు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజీజ్‌ స్పష్టం చేశారు. బిల్లుకు సహకరించాల్సిన విపక్షాల అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్న నిబంధన అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Read Also…. Navjot Sidhu Sidhu: వారిని బహిరంగంగా ఉరితీయాలి.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ డిమాండ్