New Parliament Building: పార్లమెంటు కొత్త భవనం.. మోదీ సర్కారుకు గులాం నబీ ఆజాద్ అభినందనలు..
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించడాన్ని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ తప్పుబట్టారు. రికార్డు టైమ్‌లో పార్లమెంటు భవన నిర్మాణ పనులను పూర్తి చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు.

Gulam Nabi Azad: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించడాన్ని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ తప్పుబట్టారు. రికార్డు టైమ్‌లో పార్లమెంటు భవన నిర్మాణ పనులను పూర్తి చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. తాను ఢిల్లీలో ఉండి ఉంటే తప్పనిసరిగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేవాడినని ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విపక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరించడం కాకుండా.. ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తే సరిగ్గా ఉండేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు చేయని పనిని ఇప్పుడు చేస్తున్నారని.. ఇది స్వాగతించాల్సిన అంశమన్నారు. ఈ కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించడం సరైన నిర్ణయం కాదన్నారు.
23 ఏళ్ల క్రితం తాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా కొత్త పార్లమెంటు భవనం ఆవసరాన్ని గుర్తించినట్లు ఆజాద్ తెలిపారు. దీని గురించి అప్పట్లో తాను నాటి ప్రధాని పీవీ నరసింహరావు, శివరాజ్ పాటిల్‌తో చర్చించినట్లు తెలిపారు.దీనికి సంబంధించిన మ్యాప్‌ను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు.అయితే నిర్మాణ పనులను చేపట్టలేకపోయినట్లు వివరించారు. అయితే ఆ స్వప్నం ఇప్పుడు నెరవేరడం సంతోషంగా ఉందన్నారు.
#WATCH | I would surely attend the inauguration ceremony of the new Parliament building if I was in Delhi. The opposition should praise the government to build the new Parliament in record time, whereas they are criticising the govt. I am strictly against the opposition… pic.twitter.com/fo5bayAwcn
— ANI (@ANI) May 27, 2023
పార్లమెంటును ప్రధాని ప్రారంభిస్తారా? రాష్ట్రపతి ప్రారంభిస్తారా? అన్నది చర్చనీయాంశం కాదని గులాంనబీ ఆజాద్ అభిప్రాయపడ్డారు. ప్రజలు ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వబోరని అన్నారు. అర్ధరహితమైన అంశాలను కాకుండా.. నిర్మాణాత్మక అంశాలపై విపక్షాలు దృష్టిసారిస్తే మంచిదన్నారు. రాష్ట్రపతిగా ముర్మును బీజేపీ గెలిపించుకుందని గుర్తుచేశారు. ఇప్పుడు ముర్ము చేత పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెపై పోటీ అభ్యర్థిని ఎందుకు బరిలో నిలిపారో చెప్పాలని ప్రశ్నించారు.

Ghulam Nabi Azad
పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు ప్రారంభించనున్నారు. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము చేతులమీద కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సహా 19 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. విపక్షాల నిర్ణయాన్ని బీజేపీ సహా ఎన్టీయే భాగస్వామ్యపక్షాలు తప్పుబట్టాయి. వైసీపీ, టీడీపీ, బీజేడీ, బీఎస్పీ, అకాలీదళ్, లోక్ జనశక్తి(పాశ్వాన్) తదితర విపక్ష పార్టీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించాయి.
మరిన్ని జాతీయ వార్తలను చదవండి..




