Free Biryani For Cylinder: హోటల్ బంపరాఫర్.. LPG సిలిండర్ ఇచ్చి నెలంతా బిర్యానీ ఉచితంగా తినండి!
Help us cook, we will fill your stomach: ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ సంఘర్షణ నేపథ్యంలో, ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్‌తోపాటు ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా హోటల్, రెస్టారెంట్ల వ్యాపారం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఈ క్రమంలో తమిళనాడులోని ఓ హోటల్ యాజమన్యం వినూత్నం ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా ఒక సిలిండర్ అందిస్తే.. ఏకంగా నెల రోజుల పాటు వేడివేడి బిర్యానీ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. 'వంట చేయడానికి మాకు సహాయం చేయండి.. మీకు ఉచితంగా భోజనం పెడతాం' అనే సందేశంతో సదరు హోటల్ యాజమన్యం బంపరాఫర్ ప్రకటించింది. దీంతో ఈ ఆఫర్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది..

తమిళనాడులోని హోసూరులో తళి రోడ్డులో ఉన్న ఈరోడ్ ఎమ్మిస్ మెస్ హోటల్ నిర్వాహకులు ఎల్పీజీ సిలిండర్ కోసం ఓ వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా తమకు ఒక కమర్షియల్ సిలిండర్ విరాళంగా ఇస్తే.. నెల పాటు ప్రతి రోజూ ఒక ప్లేట్ బిర్యానీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అదే రెండు సిలిండర్లు విరాళంగా ఇస్తే నెల పాటు ప్రతి రోజూ 2 బిర్యానీ ప్లేట్లు ఉచితంగా బిర్యానీ తినొచ్చని ప్రకటించారు. వారు ఫుల్ సిలిండర్ తీసుకునివస్తే అదే కంపెనీకి చెందిన ఖాళీ సిలిండర్ వెంటనే ఇచ్చేస్తామని బోర్డు పెట్టారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ కొరత కారణంగా తాము ‘ఎక్స్ఛేంజ్ పాలసీ’ని తీసుకువచ్చినట్లు హోటల్ యజమాని చెబుతున్నాడు.
పెరుగుతున్న గ్యాస్ ధరలను భర్తీ చేయడానికి కొంతమంది హోటల్ యజమానులు కస్టమర్ల బిల్లులపై అదనపు ‘గ్యాస్ ఛార్జీలు’ సైతం వసూలు చేయడం ప్రారంభించాయి. మరికొందరు తమ హోటళ్లను తాత్కాలికంగా మూసివేశారు. అయితే ఈరోడ్ ఆమీస్ మెస్ మాత్రం కస్టమర్లు గ్యాస్ సిలిండర్లు ఇస్తే.. ఇచ్చిన వారికి ఉచితంగా కడుపునిండా బిర్యానీ పెడతామని ప్రకటించింది. ఇక ఈ ప్రకటనకు విశేష స్పందన కూడా వచ్చిందట. కేవలం పదిహేను రోజుల్లోనే 6 సిలిండర్లు తీసుకొచ్చి ఇచ్చారట. అయితే వారు ఉచిత బిర్యానీ ఆఫర్‌ను తిరస్కరించారట. వారిలో ఎవరూ నాలుగు రోజులకు మించి ఆ హోటల్లో బిర్యానీ తినలేదని హోటల్ యాజమన్యం చెప్పింది. గ్యాస్ కొరత కారణంగా హోటల్‌ను మూసెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు, తన పాత కస్టమర్లు ఈ ఐడియా ఇచ్చారని సదరు రెస్టారెంట్ మేనేజర్ అశోక్ తెలిపారు.
కేవలం బిర్యానీ కోసమే కాకుండా, ఈ కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ముందుకు వచ్చినట్లు సిలిండర్లు ఇచ్చిన వారు చెప్పడం విశేషం. కాగా ఈరోడ్ ఆమీస్ మెస్ అందించే ‘సీరగ సాంబ బిర్యానీ’ స్థానికంగా యమ ఫేమస్. యావత్ ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు కేవలం ప్రభుత్వాలు, పెద్ద కంపెనీలు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఒకరికొకరు అండగా నిలుస్తారని ఈ సంఘటన వెల్లడించింది. ఉద్దేశాలు స్వచ్ఛమైనవైతే, ఏ పొయ్యి కూడా చల్లారిపోదని హోసూర్‌లోని ఈ చిన్న రెస్టారెంట్ నిరూపించింది. ఇది కేవలం ఒక వ్యాపార స్టంట్ మాత్రమే కాదు కష్టాలను అధిగమించడం నేర్పించే ఒక ఉదాహరణ కూడా.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




