AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!

Nagarkurnool RMP Doctor Murder: నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లిలో సంచలనం సృష్టించిన ఆర్ఎంపీ డాక్టర్ బోగిని మల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. పదేళ్లుగా కొనసాగుతున్న భూ వివాదమే ఈ హత్యకు కారణమని తేల్చిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

కళ్లల్లో కారం చల్లి... కత్తులతో నరికి... RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
Nagarkurnool RMP Doctor Murder
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Aug 03, 2026 | 10:53 PM

Share

భూ తగాదా చివరకు రక్తపాతానికి దారి తీసింది. ప్రాణాలు కాపాడాల్సిన ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను అతని క్లినిక్‌లో ఉండగానే కిరాతకంగా హత్య చేశారు. కళ్లల్లో కారం చల్లి… బయటకు ఈడ్చుకొచ్చి… నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో గొంతు, తలపై విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. పదేళ్లుగా కొనసాగుతున్న భూ వివాదం.. అనేక చిక్కుముడుల కేసులతో సాగిన తగదా చివరికి ప్రత్యర్థి రక్తం కళ్లారాచూసింది.

నాగర్ కర్నూల్ జిల్లాలో సంచలనం రేపిన పెంట్లవెళ్లి ఆర్ఎంపీ డాక్టర్ బోగిని మల్లయ్య హత్య కేసును పోలీసులు చేధించారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. హత్యకు పురిగొల్పిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పెంట్లవెళ్లి మండలం పగడాల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మల్లయ్య దాదాపు 20ఏళ్ల క్రితం మండల కేంద్రానికి వలస వచ్చి కుటుంబంతో సహా స్థిరపడ్డాడు. గ్రామంలో క్లినిక్ ఏర్పాటు చేసుకొని ప్రాథమిక చికిత్స అందిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే 2016 నుంచి పెంట్లవెళ్లి గ్రామానికి చెందిన బింగి క్రిష్ణయ్య కుటుంబంతో భూ వివాదం నడుస్తోంది. ఇరు వర్గాల మధ్య అనేక మార్లు గొడవలు, దాడులు సైతం జరిగాయి. ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో 14 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే భూమికి సంబంధించి సివిల్ కేసు న్యాయస్థానం పరిధిలో విచారణ సాగుతోంది. దాదాపుగా పదేళ్ల నుంచి భూ వివాదం కొనసాగుతుండడంతో ఆర్ఎంపీ డాక్టర్ మల్లయ్యపై ప్రత్యర్థి కుటుంబం బింగి క్రిష్ణయ్య పగ పెంచుకుంది. ఈ క్రమంలో మల్లయ్యను మట్టుబెట్టాలని సిద్ధమయ్యారు.

పథకం ప్రకారం బింగి క్రిష్ణయ్య, బింగి ఎల్లమ్మ, బింగి నాగమ్మలు గత నెల 31వ తేదిన రాత్రి 8 గంటలకు మల్లయ్య క్లినిక్‌కు చేరుకున్నారు. క్లినిక్‌లో పేషేంట్స్ లేని సమయం చూసి ఒక్కసారిగా చోరబడ్డారు. తన కుర్చీలో కూర్చోని ఉన్న మల్లయ్య కళ్లల్లో వెంట తెచ్చుకున్న కారం చల్లారు. ఆ తర్వాత బలవంతంగా క్లినిక్ బయట రోడ్డుపైకి లాక్కోచ్చారు. అందరూ చూస్తుండగానే మల్లయ్యను కింద పడేసి కత్తితో మెడ, తలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.

పబ్లిక్‌గా జరిగిన ఈ దారుణ హత్యతో నాగర్ కర్నూల్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మృతుని భార్య మణేమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీసీ ఫుటేజ్ సేకరించి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బింగి క్రిష్ణయ్య కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నారు. వీరిని ప్రోత్సహించిన మరో వ్యక్తి శేఖర్‌పై కేసు నమోదు చేయడంతో ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపారు. దశాబ్దాల భూవివాదం చివరకు ఓ డాక్టర్ ప్రాణాలను బలితీసుకుంది. కోర్టుల్లో కేసులు నడుస్తుండగానే కక్షగట్టి కిరాతకానికి పాల్పడిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

Follow Us