Hyderabad: హైదరాబాద్‌లో 4 కిలోమీటర్ల మేర భారీ ఫ్లైఓవర్.. ఆరు లైన్లుగా నిర్మాణం.. ఈ మార్గంలో ఫిక్స్..
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్దమవుతోంది. నాలుగు కిలోమీటర్ల మేర ఆరు లైన్ల భారీ వంతెన నిర్మాణానికి ప్రణాళికలు రచించింది. ఈ పనులు చేపట్టే సంస్థను కూడా ఓకే చేశారు. త్వరలోనే పనులు మొదలయ్యే అవకాశముంది. వ్యయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనదారులకు సిగ్నల్ ఫ్రీ జర్నీ అందించేందుకు జీహెచ్‌ఎంసీ అనేక ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా నగరంలో ఎక్కడికక్కడ కొత్త ఫ్లైఓవర్లను నిర్మిస్తోంది. ఎలివేటెడ్ కారిడార్ విధానంలో వీటిని నిర్మిస్తోంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో వీటిని నిర్మిస్తుండగా.. ఫ్లైఓవర్ల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు వాహనదారులకు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అనేక మార్గాల్లో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి రాగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు లైన్ క్లియర్ అయింది.
ఎలివేటెడ్ కారిడార్ రూట్ మ్యాప్ ఇదే..
పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోర్ట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. పంజాగుట్టలోని ఎన్‌ఎఫ్‌సీఎల్ సర్కిల్ వద్ద ఇది ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ వరకు 4 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఆరు లైన్లుగా ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లోని ముఫకంజా కాలేజ్ దగ్గర ఫ్లైఓవర్‌పైకి వాహనాలు ఎక్కేలా ప్లాన్ చేశారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36ను కలుపుతూ ఈ భారీ వెంతన నిర్మించనున్నారు. పంజాగుట్ట నుంచి ఈ ఫ్లైఓవర్ మీదుగా నేరుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ కింద వరకు చేరుకోవచ్చు. ఇక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఫ్లైఓవర్ మీదుగా ముఫకంజా కాలేజీ వద్ద దిగవచ్చు. ఇక బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1 వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ఎలివేటెడ్ కారిడార్ నుంచి జలగం వెంగళరావు పార్క్ వరకు ప్రత్యేక ర్యాంపు నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది.
కేబీఆర్ పార్క్ చూట్టూ ఫ్లైఓవర్లపై వెనకడుగు..
ఈ భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును మేఘా సంస్థకు జీహెచ్‌ఎంసీ అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మించాలనే ప్రతిపాదనను జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న వన్ వే విధానం వల్ల ట్రాఫిక్ సమస్య భారీగా తగ్గింది. దీంతో భారీ ఖర్చు పెట్టి స్టీల్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు నిర్మించాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి జీహెచ్‌ఎంసీ వచ్చింది. దీంతో కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలకు సంబంధించి మేఘా, కేఎన్ఆర్ సంస్థలకు పనులను అప్పగించారు. ఇప్పుడు ఆ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను జీహెచ్‌ఎంసీ రద్దు చేసుకుంది. తొలుత కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు రూ.1090 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్లు నిర్మించాలని భావించారు. వన్ వే విధానం అమలు చేసిన తర్వాత ట్రాఫిక్ సాఫీగా సాగుతోంది. దీంతో ఆ ప్రాజెక్టులను రద్దు చేశారు.
