AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నాకు తెలియదు’ అని చెప్పడానికీ ధైర్యం కావాలి.. UPSC ఇంటర్వ్యూలో టాపర్ IAS స్మితా సభర్వాల్ సక్సెస్ సీక్రెట్

ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ తన విజయ ప్రస్థానంలో నిజాయితీ, నిరంతర కృషి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆమె సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, తెలిసిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు తెలియని ప్రశ్నలకు నాకు తెలియదు అని స్పష్టంగా చెప్పడం తన విజయానికి కారణమైందని వెల్లడించారు. ఇంటర్వ్యూలో ఆమె సాధించిన అత్యధిక మార్కులు ఆమె నిజాయితీకి నిదర్శనంగా నిలిచాయని పేర్కొన్నారు. పదో తరగతి నుండి ఆల్ ఇండియా టాపర్‌గా నిలవడం, అలాగే మెయిన్స్ పరీక్షలో మంచి మార్కులు సాధించడం తన స్థిరమైన రికార్డుకు నిదర్శనమని ఆమె తెలిపారు..

'నాకు తెలియదు' అని చెప్పడానికీ ధైర్యం కావాలి.. UPSC ఇంటర్వ్యూలో టాపర్ IAS స్మితా సభర్వాల్ సక్సెస్ సీక్రెట్
IAS officer Smita Sabharwal success secrets
Srilakshmi C
|

Updated on: Aug 03, 2026 | 8:36 PM

Share

ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ తన అద్భుతమైన సివిల్ సర్వీసెస్ ప్రయాణం, విజయ రహస్యాలను పంచుకున్నారు. నిజాయితీ, నిరంతర కృషి, అలాగే ప్రజల అవసరాలను లోతుగా అర్థం చేసుకోవడం తన విజయానికి పునాదులని ఆమె స్పష్టం చేశారు. ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షల విధానాన్ని వివరిస్తూ.. ఇందులో ప్రిలిమినరీ, మెయిన్స్, ఆపై ఇంటర్వ్యూ ఉండేవని తెలిపారు. మెయిన్స్ పరీక్షలో మంచి మార్కులు సాధించిన ఆమె, ఇంటర్వ్యూ అనుభవం తన జీవితంలో ఒక కీలక మలుపు అని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అడిగిన 12 ప్రశ్నల్లో కేవలం 7 లేదా 8 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పగలిగానని, అయితే తెలియని ప్రశ్నలకు చాలా స్పష్టంగా, నిజాయితీగా ‘నాకు తెలియదు’ అని చెప్పానని వివరించారు. బోర్డు సభ్యులు ఊహించి చెప్పమని ప్రోత్సహించినప్పటికీ, తన నిజాయితీని వదులుకోలేదని ఆమె తెలిపారు. ఈ నిజాయితీనే ఆమెకు ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులు రావడానికి కారణమని, తన ఇంటర్వ్యూ స్కోర్ అప్పట్లో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ తర్వాత నిరాశకు గురై తన తండ్రికి ‘ఇది పోయింది, ఆశలు పెట్టుకోవద్దు’ అని చెప్పిన ఆమె, ఫలితాలు వచ్చినప్పుడు అవాక్కయ్యారని తెలిపారు.

ఆమె చిన్నతనం నుండి స్థిరంగా రాణించడం కూడా తన విజయానికి దోహదపడిందని పేర్కొన్నారు. 10వ తరగతి, 12వ తరగతి రెండింటిలోనూ ఆమె ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. ఈ స్థిరత్వం, శ్రమించే తత్వం సివిల్ సర్వీసెస్ విజయంలో కీలక పాత్ర పోషించాయని ఆమె అభిప్రాయపడ్డారు. తన కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన మలుపులలో ఒకటి ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMs office) తొలి మహిళా అధికారిగా బాధ్యతలు స్వీకరించడం. మెదక్ కలెక్టర్‌గా ఫీల్డ్ జాబ్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆమెకు, సీఎం కార్యాలయంలోని బాధ్యతలు మొదట కొంత ఆందోళన కలిగించాయని తెలిపారు. అయితే, ఈ అవకాశాన్ని ఒక గొప్ప బాధ్యతగా స్వీకరించానని, నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. నేను అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనుకోను. కొత్త పని అప్పగించినప్పుడు, నేను దాని గురించి అధ్యయనం చేస్తాను. క్రమశిక్షణ, కఠోర శ్రమ నా విజయానికి మంత్రాలు అని ఆమె వెల్లడించారు. విజయవంతం కావాలంటే కష్టపడాలి, కానీ విజయవంతంగా కొనసాగాలంటే ఇంకా కష్టపడాలి అనే సూత్రం తనను నిత్యం నడిపిస్తుందని ఆమె అన్నారు.

మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేసిన కాలం తన జీవితంలో మరచిపోలేని అనుభవాలను ఇచ్చిందని స్మితా సభర్వాల్ గుర్తుచేసుకున్నారు. దాదాపు 15-17 సంవత్సరాలు ఫీల్డ్ జాబ్‌లో ఉన్నానని, ఈ సమయంలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అనేక అవకాశాలు లభించాయని అన్నారు. ప్రజల నిజమైన ప్రాధాన్యతలు, వారి సమస్యలు ఏమిటో అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా పని చేస్తేనే శ్రమకు సరైన ప్రతిస్పందన లభిస్తుందని ఆమె నొక్కి చెప్పారు. కీర్తి, ప్రచారం కోసం కాకుండా, ప్రజల అవసరాల కోసం పని చేయడమే నిజమైన సేవ అని ఆమె తన పని విధానాన్ని వివరించారు. సోషల్ మీడియాలో తనకు లభించే ప్రేమ, ఆప్యాయతలు మరింత మంచి పని చేయడానికి ప్రేరణనిస్తాయని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us