Rattandeep Singh: పంజాబ్‌లో ఖలిస్తాన్ మాజీ చీఫ్ రత్తన్‌దీప్ సింగ్ దారుణ హత్య.. బైక్ వచ్చి కాల్పులు జరిపిన గుర్తుతెలియని వ్యక్తులు
ఉగ్రవాద సంస్థ భింద్రన్‌వాలే టైగర్ ఫోర్స్ ఆఫ్ ఖలిస్తాన్ (బీటీఎఫ్‌కె) మాజీ చీఫ్ రత్తన్‌దీప్ సింగ్ (49) గురువారం తెల్లవారుజామున హత్యకు గురమంమాడు. షహీద్ భగత్ సింగ్ నగర్‌లోని బాలాచౌర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రత్తన్‌దీప్‌ను కాల్చి చంపారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రత్తన్‌దీప్ సింగ్, అతని మేనల్లుడు గురుప్రీత్ సింగ్‌తో కలిసి ఉండగా.. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు..
పంజాబ్, ఏప్రిల్ 5: ఉగ్రవాద సంస్థ భింద్రన్‌వాలే టైగర్ ఫోర్స్ ఆఫ్ ఖలిస్తాన్ (బీటీఎఫ్‌కె) మాజీ చీఫ్ రత్తన్‌దీప్ సింగ్ (49) గురువారం తెల్లవారుజామున హత్యకు గురమంమాడు. షహీద్ భగత్ సింగ్ నగర్‌లోని బాలాచౌర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రత్తన్‌దీప్‌ను కాల్చి చంపారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రత్తన్‌దీప్ సింగ్, అతని మేనల్లుడు గురుప్రీత్ సింగ్‌తో కలిసి ఉండగా.. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మాత్తుగా కల్పాలు జరిపారు. ఈ ఘటనలో రత్తన్‌దీప్ అక్కడికక్కడే మృతి చెందగా.. గురుప్రీత్ ప్రాణాలతో బయటపడ్డాడు.
1999 జూన్ 30వ తేదీన చండీగఢ్‌లోని సెక్టార్ 34లోని పాత పాస్‌పోర్ట్ కార్యాలయం పార్కింగ్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుళ్లలో రత్తన్‌దీప్ ప్రధాన నిందితుడు. అదే సంవత్సరం పానిపట్‌లోని రైల్వే వంతెనపై జరిగిన పేలుడు వెనుక కూడా అతని హస్తం ఉంది. 1998లో షహాబాద్-మార్కండ వంతెన వద్ద ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైజ్ (IED)ను అమర్చాడు. 1996 – 2000లో జింద్ జిల్లాలో ఆయుధాల రికవరీలోనూ నిందితుడుగా ఉన్నాడు. హర్యానా పోలీసులు 1999 ఆగస్టులో అతన్ని అరెస్టు చేసినప్పటికీ, తప్పించుకుని పారిపోయాడు. మే 2010లో అమృత్‌సర్‌లోని సర్క్యూట్ హౌస్ సమీపంలో ఓ వాహనంలో పేలుడు పదార్థాలను అమర్చిన ఉగ్రవాదుల బృందానికి కింగ్‌పిన్‌గా ఉన్నాడు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరిహద్దు దాటింటి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు పంజాబ్ పోలీసుల రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (SSOC) సెప్టెంబర్ 17, 2014న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ శివార్లలో రత్తన్‌దీప్‌ను అరెస్టు చేసింది. రత్తన్‌దీప్ వద్ద హుస్సేన్ షేక్ జాహిద్ పేరుతో పాకిస్థాన్ పాస్‌పోర్ట్, గుర్తింపు కార్డులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రత్తన్‌దీప్ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అని, 1993 నుంచి అక్కడే నివసిస్తున్నట్లు, భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించడానికి అతను వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న కారణంగా జైలుకెళ్లిన రత్తన్‌దీప్.. జైలు శిక్ష పూర్తయిన తర్వాత 2019లో విడుదలయ్యాడు. అప్పటి నుంచి రత్తన్‌దీప్‌పై కేసులు లేకపోవడంతో కర్నాల్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.
అయితే గురువారం బాలాచౌర్‌లోని గర్హిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో స్నేహితులను కలవడానికి కారులో వచ్చిన రత్తన్‌దీప్‌ను మోటారుసైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపినట్లు రత్తన్‌దీప్ మేనల్లుడు పోలీసులకు తెలిపాడు. కాల్పులు జరిపిన అగంతకులు రత్తన్‌దీప్‌ను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో కాల్చారు. చాతీ, కడుపులో బెల్లెట్లు దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అతని కారు నుంచి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద సంస్థతో అతను తిరిగి సంబంధాలు కొనసాగిస్తున్నాడేమో అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే గ్యాంగ్‌స్టర్ గోపి నవన్‌షాహ్రియా ఈ హత్యకు బాధ్యత వహిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడు. రత్తన్‌దీప్ పోలీస్‌గా వ్యవహరిస్తూ అమాయక యువకులతో మోసానికి పాల్పడుతున్నట్లు అతను పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన ఎస్పీ ముకేస్ కుమార్ సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా నేరాన్ని ధృవీకరించలేమని అన్నారు. రత్తన్‌దీప్ మేనల్లుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.