PS Vs EPS: అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పళని ఎన్నిక చెల్లదు.. పార్టీ పగ్గాల కోసం న్యాయపోరాటం కొనసాగిస్తా: శశికళ
AIADMK Leadership Row: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నిక చెల్లదంటున్నారు శశికళ. పార్టీ కోసం తన న్యాయ పోరాటం కొనసాగుతుందన్నారు. జరుగుతున్న పరిణామాలతో ఎంజీఆర్,జయలలితల ఆత్మలు క్షోభిస్తాయన్నారు.
అన్నాడీఎంకేలో పళని-పన్నీర్ వర్గాల తన్నులాటపై మండిపడ్డారు పార్టీ బహిష్కృత నేత శశికళ. ఎంజీఆర్ ఆశయాలను తుంగలో తొక్కిన నేతలు వీధిపోరాటాలకు దిగారని విమర్శించారు. ఎంజీఆర్ , జయలలితల ఆత్మ క్షోభిస్తుందన్నారు. పార్టీ జనరల్‌సెక్రటరీగా పళనిస్వామి ఎన్నిక చెల్లదన్నారు శశికళ. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవిపై తాను మద్రాస్ హైకోర్టులో కేసు వేశానని , కేసు విచారణ జరుగుతున్న సమయంలో పార్టీ సమావేశాన్ని పళనిస్వామి ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. పళనిస్వామికి కార్యకర్తల మద్దతు లేదన్నారు. నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తలకు న్యాయం చేసేందుకు తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు.
అన్నాడీఎంకే రెండాకులు చీలిపోతున్నాయి. అన్నాడీఎంకే కార్యాలయాన్ని సీల్ చేశారు పోలీసులు . అన్నాడీఎంకే నుంచి పన్నీర్‌సెల్వంను బహిష్కరించడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. అన్నాడీఎంకే కార్యాలయం ఎదుట ఓపీఎస్ ధర్నాకు దిగారు. పోలీసులను అయన్ను అరెస్ట్ చేశారు. ఇరువర్గాల ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. శాంతిభద్రతల సమస్య కారణంగా పార్టీ కార్యాలయాన్ని సీల్ చేసినట్టు పోలీసులు వివరణ ఇచ్చారు. అన్నాడీఎంకే నుంచి తనను బహిష్కరించే అధికారం పళనిస్వామికి లేదన్నారు పన్నీర్‌సెల్వం.
అన్నాడీఎంకే పార్టీకి తాను కోశాధికారినని, తానే పళనిస్వామిని పార్టీ నుంచి బహిష్కరిస్తునట్టు తెలిపారు.అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా ఇక పార్టీలో తానే సుప్రీం అంటున్నారు పళనిస్వామి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నుకున్న కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో ఎంజీఆర్ , జయలలిత సమాధులను సందర్శించారు పళనిస్వామి. పన్నీర్ వర్గంతో జరిగిన ఘర్షణల్లో గాయపడ్డ తన వర్గం కార్యకర్తలను పళనిస్వామి పరామర్శించారు.. రౌడీలతో అన్నాడీఎంకే కార్యాయాలన్ని ఆక్రమించుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు.