Tomato Flu: అలర్ట్.. టొమాటో ఫ్లూ వ్యాధిపై రాష్ట్రాలకు కీలక సూచనలు.. నివారించాలంటే ఇవి తప్పదంటోన్న కేంద్రం..
Tomato Flu in India: భారతదేశంలో మొదటి టొమాటో ఫ్లూ కేసు ఈ ఏడాది మే 6న కేరళలోని కొల్లం జిల్లాలో నమోదైంది. కాగా, ఇప్పటివరకు 82 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
దేశంలోని పిల్లలలో 82 ‘టమోటో ఫ్లూ’ కేసులు నమోదవడంతో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం (GOI) మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ వైరల్ వ్యాధికి చికిత్స చేయడానికి నిర్దిష్టమైన ఔషధం లేదని కూడా కేంద్రం నొక్కి చెప్పింది. దీంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ వ్యాధి చేతులు, పాదాలు, నోటిలో (HFMD) కనిపిస్తుంది. ఇది ప్రధానంగా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సంభవిస్తుంది. కానీ, పెద్దలు కూడా దీని బారిన పడవచ్చు. వ్యాధి సంకేతాలు, లక్షణాలు మరియు దాని దుష్ప్రభావాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని కేంద్రం సూచించింది.
‘టమోటా ఫ్లూ’ ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల మాదిరిగా లక్షణాలను (జ్వరం, అలసట, శరీర నొప్పి, చర్మపు దద్దుర్లు వంటివి) చూపుతున్నప్పటికీ, వైరస్‌కు SARS-CoV-2, మంకీపాక్స్, డెంగ్యూ లేదా చికున్‌గున్యాతో ఎటువంటి సంబంధం లేదని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది మే 6న కేరళలోని కొల్లం జిల్లాలో తొలి ‘టమోటా ఫ్లూ’ కేసు నమోదవ్వగా, ఇప్పటివరకు 82 కేసులు వెలుగు చూశాయి.
చిన్న పిల్లలకు టొమాటో ఫ్లూ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాప్తిని నియంత్రించకపోతే, సంక్రమణ పెద్దలకు కూడా వ్యాపిస్తుంది. ‘ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనంలో ఈ హెచ్చరికలు జారీ చేసింది. లాన్సెట్ నివేదిక ప్రకారం, టొమాటో ఫ్లూ లేదా టొమాటో జ్వరం మొదటిసారిగా మే 6న కేరళలోని కొల్లం జిల్లాలో గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అందిన సమాచారం ప్రకారం, జులై 26 వరకు, ఐదేళ్లలోపు 82 మంది పిల్లలకు ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేరళతో పాటు తమిళనాడు, ఒడిశాలో కూడా టమోటా ఫ్లూ కేసులు నమోదయ్యాయి.
టొమాటో ఫ్లూపై నివేదికలో ఏముందంటే..
ఆగస్ట్ 17న ప్రచురించిన నివేదిక ప్రకారం, “పిల్లలకు టొమాటో ఫ్లూ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే ఈ వయస్సులో వైరల్ ఇన్‌ఫెక్షన్ సర్వసాధారణం. దగ్గరి పరిచయం ద్వారా వ్యాపిస్తుంది. చిన్న పిల్లలు కూడా న్యాప్ కిన్‌ని ఉపయోగించడం, మురికిగా ఉన్న ఉపరితలాలను తాకడం, నేరుగా నోటిలో వస్తువులను పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. తీవ్రమైన పరిణామాలు రావొచ్చు.
ఈ వ్యాధితో శరీరంపై ఎరుపు రంగు పొక్కులు లేదా బొబ్బలు వ్యాపిస్తాయి. దీని వలన నొప్పి వస్తుంది. అందుకే దీనిని టొమాటో ఫ్లూ అంటారు. అధ్యయనం ప్రకారం, ఈ వ్యాధి ప్రాణాంతకం కానప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి భయంకరమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, దాని వ్యాప్తిని నివారించడానికి జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. జ్వరం, అలసట, శరీర నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలు కూడా కోవిడ్‌లో కనిపిస్తాయి.