AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangster Jitender: ఢిల్లీ కోర్టు ఆవరణలో గ్యాంగ్‌వార్‌.. కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌తో పాటు నలుగురు మృతి

Gangster Jitender: ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో గ్యాంగ్‌వార్‌ జ‌రిగింది. అడ్వకేట్ ముసుగులో కోర్టు ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన ఇద్దరు దుండ‌గులు..

Gangster Jitender: ఢిల్లీ కోర్టు ఆవరణలో గ్యాంగ్‌వార్‌.. కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌తో పాటు నలుగురు మృతి
Subhash Goud
|

Updated on: Sep 24, 2021 | 3:44 PM

Share

Gangster Jitender: ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో గ్యాంగ్‌వార్‌ జ‌రిగింది. అడ్వకేట్ ముసుగులో కోర్టు ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన ఇద్దరు దుండ‌గులు.. ఢిల్లీలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ జితేంద‌ర్‌ను కాల్చి చంపారు. రెండు గ్యాంగ్‌లు కాల్పులు జరుపుకోవడంతో జితేందర్‌తో పాటు నలుగురు మృతి చెందారు. న్యాయ‌మూర్తి వ‌ద్ద జితేంద‌ర్‌ను ప్రవేశ‌పెట్టేందుకు వ‌చ్చిన స‌మ‌యంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఘ‌ట‌న‌లో గ్యాంగ్ స్టర్ జితేంద‌ర్ లాయ‌ర్ కు తీవ్ర గాయాలైన‌ట్లు తెలుస్తోంది. అయితే, కోర్టు వ‌ద్ద విచక్షణార‌హితంగా కాల్పులు జ‌రప‌టంతో సాధారణ వ్యక్తులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్‌ జితేంద‌ర్ పై కాల్పుల స‌మ‌యంలో జితేంద‌ర్‌కు ర‌క్షణ‌గా ఉన్న ఢిల్లీ పోలీసులు కూడా కాల్పులు జ‌ర‌ప‌టంతో ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటి వ‌ర‌కు మొత్తం న‌లుగురు మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు ధృవీక‌రించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

జితేందర్‌పై 19 కేసులు:

రెండు గ్యాంగ్‌ల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కోర్టుకు వచ్చిన జితేందర్‌ టార్గెట్‌గా ఈ కాల్పులు జరిగాయి. అడ్వాకేట్ యూనిఫారమ్స్‌లో వచ్చిన ఇద్దరు ప్రత్యర్థులు కాల్పులకు తెగబడ్డారు. 30 ఏళ్ల జితేందర్‌ గత ఏప్రిల్‌లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ ఎంసీవో సీఏ కింద అరెస్టు అయ్యారు. హత్యలు, హత్యాయత్నం సహా మొత్తం 19 కేసులు జితేందర్‌పై ఉన్నాయి. క్షతగాత్రులను ఆస్పత్తికి తరలించారు. వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కాల్పులపై విభిన్నవాదనలు:

కాగా, ఈ కాల్పులపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. భద్రతాలోపాలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. కోర్టు బయట సరైన చెక్కింగ్ నిర్వహించలేదనే వాదన సైతం వినిపిస్తోంది. ఆగంతకులు ఎలా లోపలికి వచ్చారన్న ప్రశ్న తలెత్తుతోంది. కాల్పులు శబ్దం వినపడటంతో కోర్టు ఆవరణ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడి సిబ్బందికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రెండు గ్యాంగ్‌లు కాల్పులు జరుపుకోవడంతో లోపల ఉన్నవారికి ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. కాల్పుల శబ్దంతో అందరు పరుగుల తీశారు. దీనిపై పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దుండగులు ఎలా లోపలికి ప్రవేశించారు.. ఆయుధాలతో ఎలా రాగలిగారనే విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోర్టు ఆవరణలో అమర్చిన కెమెరాల్లో కాల్పుల దృశ్యాలు రికార్డు అయ్యాయి.

పక్కా ప్రణాళికతోనే అటాక్‌..

ఇక నిందితులు పక్కా ప్రణాళికతోనే అటాక్ చేసినట్లు తెలుస్తోంది. జితేందర్‌ గోగి కోర్టుకు హాజరవుతారనే ముందస్తు సమాచారం మేరకు ముందుగానే కోర్టు ఆవరణను రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిందితులు లాయర్ వేషధారణలో వచ్చి కాల్పులు జరిపారని తెలుస్తోంది. 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరుపుకొన్నట్లు తెలుస్తోంది.

జితేందర్‌పై రివార్డ్‌..

ప్రతి కోర్టు హాల్‌ ముందు మెటల్ డిటెక్టర్లు ఉండగా వాటిని తప్పించుకుని ఎలా ప్రవేశించగలిగారనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రెక్కీ నిర్వహిస్తున్న సమయంలోనే లోపలి వ్యక్తులు ఈ దుండగులకు సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, గ్యాంగ్‌స్టర్ జితేందర్ అలియాస్ గోగిపై ఢిల్లీ ప్రభుత్వం రూ.10 లక్షలు, హర్యానా ప్రభుత్వం రూ.10 లక్షలు మొత్తంగా రూ.20 లక్షలు రివార్డును గతంలో ప్రకటించడం జరిగింది.

ఇవీ కూడా చదవండి:

Errabelli Dayakar Rao: రోడ్డు ప్రమాదంలో మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ముప్పు.. కాన్వాయ్‌ను ఢీకొన్న బైక్‌!

Crime News: మద్యప్రదేశ్‌లో దారుణం..! కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికిన దుండగులు..