ఏడు నెలల నిర్బంధం తరువాత.. తండ్రీ కొడుకుల భేటీ
ఏడు నెలల నిర్బంధం అనంతరం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం జైలు నుంచి రిలీజయ్యారు.
ఏడు నెలల నిర్బంధం అనంతరం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం జైలు నుంచి రిలీజయ్యారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద ఆయన ఇంతకాలం నిర్బంధంలో ఉన్నారు. శ్రీనగర్ లోని జైల్లో తనను కలుసుకోవడానికి వఛ్చిన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను చూసి ఆయన ఉద్వేగానికి గురయ్యారు. అటు తన తండ్రిని చూసిన ఒమర్ సైతం ఆనంద భాష్పాలతో ఆయనను హగ్ చేసుకున్నారు. ఒమర్ కూడా నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. శ్రీనగర్లోని తన తండ్రి, మాజీ సీఎం షేక్ అబ్దుల్లా సమాధిని ఫరూక్ అబ్దుల్లా తన భార్య, మనుమడితో కలిసి సందర్శించి అక్కడ ప్రార్థనలు చేశారు. తన యోగక్షేమాలపై ఆందోళన వ్యక్తం చేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ.. స్వేఛ్చ ఇంకా పరిసమాప్తం కాలేదని, ఇంకా జైల్లో మగ్గుతున్న ఒమర్, మెహబూబా ముఫ్టీ వంటి రాజకీయ నేతలు విడుదల కావలసి ఉందని అన్నారు. ప్రభుత్వం త్వరలో ఇందుకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు.
జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన అధికరణం 370 ని రద్దు చేయాలని కేంద్రం గతఆగస్టు 5 న నిర్ణయం తీసుకోవడానికి ముందు ఈ నేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు. సాధారణంగా వేర్పాటువాదులు, టెర్రరిస్టులపై ప్రయోగించే ప్రజా భద్రతా చట్టాన్ని కేంద్రం మొదటిసారిగా రాజకీయ నేతలపై ప్రయోగించడం విశేషం. ఈ చట్టం కిందఒకరిని విచారణ లేకుండా మూడు నెలల పాటు డిటెన్షన్ లో ఉంచవచ్చు. ఈ శిక్షాకాలాన్ని ఎన్నోసార్లు పొడిగించవచ్చు.