Bharat Bundh: మరోసారి కేంద్రంపై సమరశంఖం పూరించిన రైతులు.. సెప్టెంబర్ 25న భారత్ బంద్!
కేంద్ర సర్కార్ దిగి రాకపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నిర్ణయించింది. ఈ క్రమంలోనే వచ్చే నెల సెప్టెంబరు 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.
Bharat Bundh on September 25: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నుంచి పలుచోట్ల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. అయినా కేంద్ర సర్కార్ దిగి రాకపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నిర్ణయించింది. ఈ క్రమంలోనే వచ్చే నెల సెప్టెంబరు 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆందోళనలు పదో నెలకు చేరుకోనున్న నేపథ్యంలో ఆదివారం ఎస్‌కేఎం ఈ పిలుపునిచ్చింది. హర్యానాలోని నూహ్‌లో నిర్వహించిన కిసాన్ మహాసభలో ఎస్‌కేఎం నేత దర్శన్ పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీ రోడ్లను దిగ్బంధించేందుకు దక్షిణ హర్యానా-మేవాట్ రైతులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీ మొత్తాన్ని మరోసారి దిగ్బంధించేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ మేరకు ఎస్‌కేఎం త్వరలోనే పిలుపునిస్తుందని దర్శన్‌పాల్ సింగ్ పేర్కొన్నారు. సెప్టెంబరు 5న ముజఫర్‌నగర్ మహాపంచాయత్‌లో ‘మిషన్ యూపీ’ని ప్రకటిస్తామన్నారు. అలాగే, ప్రతి తహశీల్, గ్రామంలోనూ ఎస్‌కేఎం యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రైతు నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. సెప్టెంబరు 5 నాటి ముజఫర్‌నగర్ మహాపంచాయత్ దేశంలోని రైతులందరికీ పరీక్షలాంటిదన్నారు. మేవాట్ రైతులు ఉత్తరప్రదేశ్ చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఇదిలావుంటే, శనివారం హర్యానాలోని కర్నాల్ జిల్లాలో చేసిన రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో దాదాపు పది మంది రైతులు గాయపడ్డారు. అయితే, కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా ఆదేశాల మేరకే రైతులపై పోలీసులు లాఠీ చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల తలలు పగులకొట్టాలని SDM ఆదేశించారని.. అందుకే పోలీసులు రెచ్చిపోయారని దుమారం రేగుతోంది. అధికారుల తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.
శనివారం హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ , రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు ఓం ప్రకాశ్ ధనాకర్, మరికొందరు నేతలు కర్నాల్‌లో జరిగిన ఓ సమవేశానికి హాజరయ్యారు. ఆ సమావేశానికి అడ్డుకునేందుకు కొందరు రైతులు ప్రయత్నించారు. హైవే మీది నుంచి ర్యాలీగా వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. బ్యారీకేడ్లు ఏర్పాటు చేసిన ఎక్కడికక్కడ అడ్డగించారు. అయినప్పటికీ రైతుల ప్రతిఘటించడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో 10 మంది రైతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. రైతులెవరూ ఇక్కడికి రాకూడదని.. వస్తే తలలు పగులకొట్టాలని కర్నాల్ ఎస్డీఎమ్ ఆయుష్ సిన్హా పోలీసులను ఆదేశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
I hope this video is edited and the DM did not say this… Otherwise, this is unacceptable in democratic India to do to our own citizens. pic.twitter.com/rWRFSD2FRH
— Varun Gandhi (@varungandhi80) August 28, 2021
” వారు ఎవరైనా గానీ.. ఎక్కడి నుంచి నుంచైనా రానీ.. ఎవ్వరినీ బారికేడ్లు దాటి ముందుకు పంపించకూడదు. ఇక్కడికి ఎవరైనా వస్తే మీ లాఠీ తీసుకొని వాళ్లను కొట్టండి. వాళ్ల తల మీద గట్టిగా కొట్టండి. దానికి ఎవరి ఇన్‌స్ట్రక్షన్స్ మీకు అవసరం లేదు. ఒక్క నిరసనకారుడు నాకు ఇక్కడ కనిపించినా, అతడి తల పగిలి కనిపించాలి. వాళ్ల తలలను మీ లాఠీలతో పగులగొట్టండి.” అని ఆయుష్ సిన్హా పోలీసులకు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఎడిట్ చేశారని.. డీఎం అలా ఆదేశించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో సొంత పౌరులపై ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
అయితే, దీనిపై పోలీసుల వర్షన్ మరోలా ఉంది. హైవేలను దిగ్బంధించిన రైతులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారని.. కానీ పోలీసులను లక్ష్యంగా చేసుకొని కొందరు ఆందోళనకారులు రాళ్లలో దాడి చేశారని అధికారుు తెలిపారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల రక్తాన్ని కళ్ల చూడడం దారుణమని.. భవిష్యత్ తరాలు ఈ ఘటనను గుర్తు పెట్టుకుంటాయని మండిపడ్డారు.