Prashant Kishor: ఎవరి దారి వారిది.. ప్రశాంత్ కిషోర్ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా?
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా జరిగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. రెండు వారాలుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ పార్టీ ఎవరిదారి వారు చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు గత రెండు వారాలుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఊహాగానాలకు తెరదించిన ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ పార్టీ ఎవరిదారి వారు చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరాలన్న ఆ పార్టీ అధిష్టాన ఉదారమైన ఆహ్వానాన్ని తాను తిరస్కరిస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ మంగళవారంనాడు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరకూడదన్న పీకే నిర్ణయం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ కాంగ్రెస్ అధిష్టానంతో పీకే చర్చలు ఎక్కడ చెడాయన్న అంశంపై రకరకాల చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌లో పీకే చేరికపై గతంలోనూ చర్చ జరిగింది. అప్పట్లో తొలత సోనియా గాంధీ(2021 మే).. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ(2021 జులై) తో పీకే ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను వారి ముందుంచారు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కోరారు. పీకేని కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సముఖంగా ఉన్నా.. ఆయన చేరికను పార్టీలోని కొందరు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పీకేని పార్టీలో చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ అప్పట్లో వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు రెండోసారి కూడా వారి మధ్య చర్చలు విఫలం కావడానికి కారణాలు ఏమై ఉండొచ్చని హస్తిన వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వరుస ఓటములతో ఢీలాపడిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటికిప్పుడు గాడిలో పెట్టడం అంత సులభమైన పనికాదని ప్రశాంత్ కిషోర్‌కు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు తక్కువలో తక్కువ ప్రధాన కార్యదర్శి స్థాయి కీలక పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌ను సన్నద్ధం చేసే తన ప్రణాళికలను అమలు చేసేందుకు పూర్తి స్వేచ్ఛ కావాలని పీకే ఆశించారు. అయితే పార్టీలో పెను మార్పులు చేపట్టేందుకు అధికారాలు, స్వేచ్ఛను ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించింది. కీలక పదవిలో కాకుండా సాధికార బృందంలో చేరి పార్టీ పూర్వ వైభవం కోసం పనిచేయాలని పీకేని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆహ్వానించారు. ఇది ఆయన్ను అసంతృప్తికి గురిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తగిన అధికారాలు, పూర్తి స్వేచ్ఛ లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి తగిన ఫలితాలను రాబట్టడం సాధ్యంకాదని పీకే భావించినట్లు తెలుస్తోంది. ఈ కారణాలే కాంగ్రెస్ పార్టీలో చేరకూడదన్న పీకే నిర్ణయానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
పార్టీని ప్రక్షాళన చేసే విషయంలో పీకే పూర్తి స్వచ్ఛ ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్ కోరగా.. అందుకు పార్టీ అధిష్టానం నిరాకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీలో ఒక్కసారిగా సమూల ప్రక్షాళన చేయడం కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇష్టం లేదని.. అంచలవారీగా ప్రక్షాళన చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్‌తో ఏకాభిప్రాయం కుదరకపోవడమే చర్చలు విఫలం కావడానికి కారణంగా తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులైన టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, తృణాముల్ కాంగ్రెస్ పార్టీలతో ప్రశాంత్ కిషోర్‌కు సత్సంబంధాలున్నాయి. దీన్ని కారణాలుగా చూపుతూ ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకోవద్దని కాంగ్రెస్ సీనియర్ నేతలు మొదటి నుంచీ పార్టీ అధిష్టానానికి సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ పట్ల కాంగ్రెస్ అధిష్టానంలోనూ అపనమ్మకం నెలకొన్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ విషయాల్లో పీకేకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం.
ఇప్పటి వరకు రెండుసార్లు ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ పెద్దల మధ్య చర్చలు విఫలమయ్యాయి. అయితే ఇంతటితో ఇది ముగిసిన అధ్యాయమేమీ కాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరిక అంశంపై భవిష్యత్తులో మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రశాంత్ కిషోర్ బలంగా కోరుకుంటున్నారు.. అయితే ఆయన్ను పార్టీలో చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల మధ్యే భిన్నాభిప్రాయాలు నెలకొంటున్నాయి. అయితే భవిష్యత్ రాజకీయ అవసరాలు వారిని ఎటు వైపు నడిపిస్తాయో వేచి చూడాల్సిందే..
Also Read..
SSC Paper Leak: సోషల్ మీడియాల్లో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ విద్యా శాఖ