SSC Paper Leak: సోషల్ మీడియాల్లో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ విద్యా శాఖ

సోషల్ మీడియాల్లో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ స్పందించింది. పేపర్ లీక్‌ అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ తెలిపారు.

SSC Paper Leak: సోషల్ మీడియాల్లో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ విద్యా శాఖ
Suresh Kumar
Follow us

|

Updated on: Apr 27, 2022 | 3:10 PM

AP 10th Class Paper Leak: సోషల్ మీడియాల్లో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ స్పందించింది. పేపర్ లీక్‌ అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ తెలిపారు. ఓ పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చినట్టుగా ప్రశ్నపత్రం తాలూకు ఫోటోలు.. సామాజిక మాధ్యమాల్లో 11 గంటల సమయానికి సర్క్యులేట్ అయినట్టుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. పదో తరగతి పరీక్ష 9.30 గంటలకే ప్రారంభమైందని.. కాబట్టి దీన్ని లీక్‌గా భావించలేమని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నామన్న కమిషనర్‌.. వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె జెడ్పీ పాఠశాల నుంచి ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించామని కమిషనర్‌ సురేశ్‌ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపర్‌వైజర్‌, ఇన్విజిలేటర్‌లపై శాఖపరమైన చర్యలుంటాయని తెలిపారు. పశ్నపత్రం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో పది ప్రశ్నపత్రం లీకైనట్లు ఈ ఉదయం వార్తలొచ్చాయి. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం వెలుగుచూసినట్లు.. సూపర్‌వైజర్‌, ఇన్విజిలేటర్‌ పేపర్‌ను లీక్‌ చేసినట్లు సమాచారం వచ్చింది. దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ లీక్‌ అంశం అవాస్తవమని తేల్చారు.

మరోవైపు చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు వదంతులొచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్నపత్రం ఎక్కడ లీకైందో తమకు తెలియదని విద్యాశాఖ అధికారులు చెప్పారు. చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్‌ దృష్టికి పేపర్‌ లీక్‌ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ విషయంపై చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని డీఈవో పురుషోత్తం తెలిపారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ వార్తలు నమ్మొద్దని చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్‌ చెప్పారు. వదంతులు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని.. చిత్తూరు జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఏపీలో ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Read Also….  PM Modi: పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని మోదీ సంచలన కామెంట్స్.. విమర్శ కాదంటూనే..