అతిథి గృహంలో బస చేసిన ముఖ్యమంత్రికి నిద్ర భంగం. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు..!

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఉన్నట్టుండీ అధికారులపై ఆగ్రహం కలిగింది. ఇంకేముంది అధికారులను పిలిపించి ఎడాపెడా వాయించేశాడు.

అతిథి గృహంలో బస చేసిన ముఖ్యమంత్రికి నిద్ర భంగం. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు..!
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 19, 2021 | 10:17 PM

engineers suspended in MP : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఉన్నట్టుండీ అధికారులపై ఆగ్రహం కలిగింది.ఇంకేముంది అధికారులను పిలిపించి ఎడాపెడా వాయించేశాడు. ఇద్దరు అధికారులను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఇంతలా సీఎం చౌహాన్ ఎందుకు కోపం వచ్చిందనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళ్తే… దోమలు చుక్కలు చూపించాయి. రాత్రంతా తెగకుట్టాయి. మరోవైపు మధ్య రాత్రి వేళ ట్యాంకు నిండి నీరు కారుతున్న శబ్ధంతో ఆయనకు నిద్రపట్టలేదు. చివరకు ఆయనే లేచి మోటార్‌ స్వీచ్‌ను ఆఫ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ రాత్రి సీఎం చౌహాన్‌కు కాళరాత్రి అయ్యింది. చివరకు ఆ అతిథి గృహం ఇంజినీర్లపై వేటు పడింది.

మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలు, గాయపడినవారిని పరామర్శించేందుకు సీఎం శివరాజ్ సింగ్‌ ఈ నెల 17న సిధికి వచ్చారు. బుధవారం రాత్రి అతిథి గృహమైన సర్క్యూట్ హౌస్‌లో బస చేశారు. అయితే, సీఎం బస చేసిన గది నిండా దోమలున్నాయి. దోమ తెరను కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. జోరుగా ముసిరి కుడుతున్న దోమల గురించి ఫిర్యాదు చేయడంతో అర్థరాత్రి 2.30 గంటలకు స్పందించిన సిబ్బంది దోమల మందును పిచికారి చేశారు.

అనంతరం సీఎం శివరాజ్‌కు కాస్త నిద్రపట్టగా తెల్లవారుజామున 4 గంటలకు ట్యాంకు నుంచి నీరు కారుతున్న శబ్దానికి నిద్రభంగమైంది. మోటార్‌ను ఎవరూ ఆపకపోవడంతో కొంత సేపటి తర్వాత ఆయనే స్వయంగా స్విచ్‌ ఆఫ్‌ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ రాత్రి నిద్రపట్టని కాళరాత్రిగా మిగిలింది. అతిథి గృహంలో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణం, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో సీఎం చౌహాన్‌ ఆదేశాలతో సిధి సర్క్యూట్ హౌస్ ఇంచార్జ్‌ అయిన సబ్ ఇంజనీర్ బాబులాల్ గుప్తా, మరో ఇంజనీర్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. వీఐపీ బస చేస్తారని ఇంచార్జ్‌ బాబులాల్‌కు చెప్పినప్పటికీ నిర్లక్ష్యగా వ్యవహరించారని అధికారులు సీరియస్ అయ్యారు. అపరిశుభ్రత, దోమలపై ఫిర్యాదు అందడంతో ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు శుక్రవారం వారిని సస్పెండ్‌ చేసినట్లు రేవా డివిజనల్ కమిషనర్ రాజేష్ కుమార్ జైన్ మీడియాకు తెలిపారు.

Read Also…  hypertension epidemic: రక్తపోటు బాధితులు మన దేశంలోనే ఎక్కువట.. జాగ్రత్తపడాలంటున్న వైద్యులు..