AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 States Assembly polls-2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం.. షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్ నిర్వహిస్తామన్న కేంద్ర ఎన్నికల సంఘం

ఉత్తరప్రదేశ్‌ , పంజాబ్‌ , ఉత్తరాఖండ్‌ , మణిపూర్‌ , గోవా రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది.

5 States Assembly polls-2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం.. షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్ నిర్వహిస్తామన్న కేంద్ర ఎన్నికల సంఘం
Cec Sushil Chandra
Balaraju Goud
|

Updated on: Jun 01, 2021 | 6:41 PM

Share

Five States Assembly Elections in 2022: కరోనా మహమ్మారికి భయపడేది లేదు. షెడ్యూల్‌ ప్రకారమే వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ , పంజాబ్‌ , ఉత్తరాఖండ్‌ , మణిపూర్‌ , గోవా రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత అని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్ర తెలిపారు.

వచ్చే సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కీలక రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల్లో షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే, కోవిడ్‌ విజృంభణ కారణంగా కొన్ని లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. తెలంగాణ,ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేశారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ తగ్గుతోందని , అందుకే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాలకు మార్చి 2022తో అసెంబ్లీ కాలవ్యవధి ముగుస్తుండగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మే చివరకు ముగియనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా, పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరిగిన మిని సంగ్రామం మాదిరిగానే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా ఉండనుంది. కరోనా వైరస్‌ విజృంభణ వేళ.. బీహార్‌, పశ్చిమబెంగాల్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో జరిపిన ఎన్నికల నిర్వహణ నుంచి ఎంతో అనుభవాన్ని పొందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పునరుద్ఘాటించింది. ప్రస్తుతం వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండడంతో వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేసింది.

‘ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిప్తోంది. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ సమయంలోనూ బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాం. దీంతో మాకు మరింత అనుభవం రావడంతోపాటు కరోనా విజృంభణ వేళ ఎన్నికల నిర్వహణలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాం’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్రా వెల్లడించారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతన్న వేళ.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను వాయిదా వేస్తుందా? అన్న ప్రశ్నకు సుశీల్‌ చంద్రా ఈ విధంగా బదులిచ్చారు. ఇప్పటికే వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని.. త్వరలోనే మహమ్మారి ప్రభావం ముగిసిపోవాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

దీంతో వచ్చే ఏడాది నాటికి కరోనా కష్టాలు తగ్గుతాయని సీఈసీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించే స్థితిలో కచ్చితంగా ఉంటామని సీఈసీ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గడువు ముగిసే నాటికి ఎన్నికలను సజావుగా నిర్వహించి, విజేతల జాబితాను గవర్నర్‌లకు అందజేయడం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కర్తవ్యమని సుశీల్‌ చంద్రా గుర్తుచేశారు.

దేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో తొలిస్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు 14.66కోట్ల మంది ఓటర్లున్నారు. జనవరి 1, 2021 నాటికి పంజాబ్‌లో రెండు కోట్లు, ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో 78 లక్షలు, మణిపూర్‌లోలో 19.58 లక్షలు, గోవాలో 11.45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇలా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లో మొత్తం దాదాపు 17.84కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. దీంతో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి సవాల్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు వివిధ దశల్లో పోలింగ్‌ నిర్వహించడంతో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు ఎదుర్కోంది. ముఖ్యంగా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది దశల్లో పోలింగ్‌ నిర్వహించారు. ఇలా ఆయా రాష్ట్రాల్లో సెకండ్‌ వేవ్‌కు కారణం ఎన్నికల ప్రచారాలేనని విమర్శలూ వచ్చాయి. భారీ స్థాయిలో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడం కరోనా ఉద్ధృతికి ఒక కారణమని పలు నివేదికలు వెల్లడించాయి.

మరోవైపు, ఈ విషయంపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులను ముందస్తుగానే హెచ్చరించినప్పటికీ వారు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికలపై ఓవైపు ఆందోళన, మరోవైపు ఆసక్తి నెలకొంది. అయితే, అప్పటివరకు ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్‌ అందించగలిగితే సమస్యలు ఉండకపోవచ్చని మరికొందరి నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఎన్నికల సందర్భంగా కోడ్‌ను కఠినంగా అమలు చేస్తామని , ఎన్నికల నియామవళి ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈసీ వివరణ ఇచ్చింది. అయితే, కరోనా కాలంలో ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.

Read Also….  Anandayya Mandhu: కృష్ణపట్నంలో మందు తయారు చేయడం సెంటిమెంట్‌.. థర్డ్ వేవ్‌కు మందు తయారు చేస్తాః ఆనందయ్య