Inspirational: ప్లాస్టిక్‌తో అంతర్జాతీయ షూ కంపెనీ.. స్ఫూర్తినిస్తోన్న 23 ఏళ్ల యువకుడి సక్సెస్ స్టోరీ..
పర్యావరణానికి అతి ప్రమాదకరమైన శత్రువు ప్లాస్టిక్. దీని వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం కానరావడం లేదు. వీధుల్లోని చెత్త కుప్పలు, డ్రైనేజీల్లో కనిపించే ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ కనిపించడమే ఇందుకు నిదర్శనం..
పర్యావరణానికి అతి ప్రమాదకరమైన శత్రువు ప్లాస్టిక్. దీని వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం కానరావడం లేదు. వీధుల్లోని చెత్త కుప్పలు, డ్రైనేజీల్లో కనిపించే ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ కనిపించడమే ఇందుకు నిదర్శనం. ‘ప్లాస్టి్క్ రీసైక్లింగ్’ అన్న మాటలు కాగితాల్లో తప్పనిస్తే ఆచరణలో కనిపించడం లేదు. ఈ క్రమంలో ‘మనసుంటే మార్గముంటది’ అన్న మాటలను నిజం చేస్తూ చెత్తకుప్పల్లో పడేసిన ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్‌తో అంతర్జాతీయ షూ తయారీ కంపెనీని ఏర్పాటు చేశాడు ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల ఆశయ్ భావే. ఆన్‌లైన్ వేదికగా అమ్మేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.
అంతర్జాతీయ ప్రమాణాలతో.. ‘తేలే’ బ్రాండ్ నేమ్‌తో ఈ ఏడాది జులైలో షూ తయారీ కంపెనీని ప్రారంభించాడు ఆశయ్. అయితే ఇదంతా ఒక్కరోజులో ఏర్పాటైనది కాది. ముందుగా ఢిల్లీ నగరంలో చెత్త సేకరించే ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నాడు. వారి సహాయంతో టన్నుల కొద్ది సేకరించిన చెత్తను డంప్ చేసేందుకు గురుగ్రామ్‌లో, షూస్ తయారు చేసేందుకు జలంధర్‌లలో ప్రత్యేకంగాయూనిట్లు ఏర్పాటుచేశాడు. షూస్ తయారీ కోసం ప్రత్యేకంగా నిపుణులను ఎంపిక చేసుకున్నారు. షూసే కాదు లేస్, ప్యాకింగ్‌కు ఉపయోగించే కవర్లు సైతం పూర్తిగా ప్లాస్టిక్ మెటీరియల్‌తో హ్యాండ్ మేడ్‌గా తయారు చేయడమే ఈ స్టార్టప్ కంపెనీ ప్రత్యేకత. ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తున్నా నాణ్యతలో ఏమాత్రం రాజీపడడం లేదు. అందువల్లే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ‘ తేలే’ బ్రాండ్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ఆర్డర్ల కోసం thaely.com అనే వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బ్రాండ్‌లో వివిధ మోడళ్ల షూస్ ధర 110 యూఎస్ డాలర్లు పలుకుతున్నాయి.
ప్యాకింగ్ కవర్‌ని పాతితే తులసి మొక్క.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా షూస్ తయారు చేస్తోన్న ఆశయ్ పర్యావరణ పరిరక్షణలోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో భాగంగా షూస్ డెలివరీ అందగానే షూ ప్యాకింగ్ చేసిన కవర్‌ని భూమిలో పాతితే 15 రోజుల్లోనే ఓ తులసి మొక్క మొలిచేలా బ్యాగ్‌ని రూపొందించారు. స్టార్టప్ ప్రారంభించిన మొదటి వారంలో 300 జతల షూలు తయారు చేయగా ఇప్పుడా సంఖ్య 15 వేల జతలకు చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఆశయ్. ఈ స్టార్టప్‌తో జలంధర్, గురుగ్రామ్‌లో ఉన్న ఫ్యాక్టరీల్లో 170 మందికి ఉపాధి దొరికింది. ఢిల్లీ నగరంలో ఉన్న రాగ్ పికర్స్(చెత్త ఏరుకునేవాళ్లు) కి ఆదాయం పెరిగింది. అంతకుమించి పర్యావరణ పరిరక్షణకు అడ్డుగా ఉన్న ప్లాస్టిక్‌ను కనుమరుగు చేసేందుకు ఓ చక్కని ఉపాయం దొరికిందని పలువురు ప్రముఖులు ఆశయ్‌ను అభినందిస్తున్నారు.
ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ట్విట్టర్ వేదికగా ఈ స్టార్టప్ కంపెనీని ప్రశంసించారు. తాజాగా ప్రముఖ పర్యావరణ వేత్త, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్‌ఈపీ) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హీమ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ స్టార్టప్ కంపెనీపై అభినందనల వర్షం కురిపించారు.
This is awesome! A startup in India ?? is making these sneakers (a $70 billion market) are made of garbage (12 plastic bottles and handful of trash bags). And for $110, they will be shipped anywhere in the world.@Thaely_inc
— Erik Solheim (@ErikSolheim) November 17, 2021
Also Read:
UP Elections 2022: యూపీలో సమాజ్‌వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. నలుగురు ముఖ్యనేతలు బీజేపీకి జంప్
Vishwanathan Anand: వెండితెరపైకి విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్.. తన పాత్రలో ఆ హీరో నటించాలంటూ..