UP Elections 2022: యూపీలో సమాజ్‌వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. నలుగురు ముఖ్యనేతలు బీజేపీకి జంప్
UP Assembly Elections 2022: వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ సమాజ్‌వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ముఖ్య నేతలు ఎస్పీకి గుడ్‌బై చెప్పి..

UP Assembly Elections 2022: వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ సమాజ్‌వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ముఖ్య నేతలు ఎస్పీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు రవి శంకర్ సింగ్ పప్పు, సీపీ చంద్, అక్షయ్ ప్రతాప్ సింగ్, రాం నిరంజన్‌లు యూపీ డిప్యూటీ సీఎంలు దినేష్ శర్మ, కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు స్వతంత్రా దేవ్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
బీజేపీలో చేరిన వీరు నలుగురూ గతంలో స్థానిక సంస్థల కోటాలో సమాజ్‌వాది పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైయ్యారు. వచ్చే ఏడాది మార్చి నెలతో వీరి పదవీకాలం ముగియనుంది. వీరు నలుగురికీ తమతమ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ ప్రజాబలం ఉంది. వీరు సమాజ్‌వాది పార్టీని వీడి బీజేపీ గూటికి చేరడంతో.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా తాము విజయం సాధిస్తామని వారు ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.
వీరిలో రవిశంకర్ సింగ్ పప్పు మాజీ ప్రధాని, ధివంగత చంద్రశేఖర్‌కు మేనళ్లుడు. చంద్ర శేఖర్ తనయుడు నిరజ్ శేఖర్ ఇది వరకే బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ సీపీ చంద్.. మాజీ మంత్రి మార్ఖండేయ చంద్ తనయుడు. మరో ఎమ్మెల్సీ అక్షయ్ ప్రతాప్ సింగ్ మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్(రాజా భయ్యా)కు సమీప బంధువు.
Lucknow | Four MLCs of Samajwadi Party, including Rama Niranjan, join BJP in the presence of Deputy CMs Dinesh Sharma-KP Maurya and party’s state chief Swatantra Dev Singh ahead of 2022 UP Assembly polls. Niranjan’s husband also joined the party at the occasion. pic.twitter.com/gCLsgMdBJS
— ANI UP (@ANINewsUP) November 17, 2021
అలాగే బీఎస్పీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్ కూడా బీజేపీ తీర్థంపుచ్చుకున్న వారిలో ఉన్నారు. ఆయన బీఎస్పీ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తుంపు ఉంది.
ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ముఖ్య నాయకుల్లో అత్యధికులు ఠాగూర్ సామాజిక వర్గానికి చెందినవారే కావడం విశేషం. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం తెలిసిందే. అధికార బీజేపీపై సమాజ్‌వాది పార్టీ పైచేయి చాటుకుంది. ఇప్పుడు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతల చేరికతో పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం అందించినట్లయ్యింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చదుర్ముఖ పోటీ నెలకొననుంది. అయితే బీజేపీ, సమాజ్‌వాది పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండొచ్చని ఒపీనియన్ పోల్స్ అంచనావేస్తున్నాయి.
Also Read..
PM Narendra Modi: ఈనెల 19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకోసమంటే..