AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌దే.. సమస్యలకు తుది పరిష్కారం అప్పుడేనన్న విదేశాంగ మంత్రి..

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగిస్తే కశ్మీర్‌ సమస్యకు తుది పరిష్కారం లభిస్తుందన్నారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌. లండన్‌ పర్యటనలో ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు ఆయన కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించడంపై విదేశాంగశాఖ మండిపడింది. తమ దేశంలో ఇలాంటి అరాచకాలు సహించేది లేదని ఖలిస్తాన్‌ వేర్పాటువాదులను..

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌దే.. సమస్యలకు తుది పరిష్కారం అప్పుడేనన్న విదేశాంగ మంత్రి..
Jai Shankar
Ravi Kiran
|

Updated on: Mar 07, 2025 | 8:55 AM

Share

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగిస్తే కశ్మీర్‌ సమస్యకు తుది పరిష్కారం లభిస్తుందన్నారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌. లండన్‌ పర్యటనలో ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు ఆయన కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించడంపై విదేశాంగశాఖ మండిపడింది. తమ దేశంలో ఇలాంటి అరాచకాలు సహించేది లేదని ఖలిస్తాన్‌ వేర్పాటువాదులను బ్రిటన్‌ ప్రభుత్వం హెచ్చరించింది. లండన్‌ పర్యటనలో ఒకేసారి అటు ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు , ఇటు కశ్మీర్‌ వేర్పాటువాదులకు ధీటైన సమాధానం ఇచ్చారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ . కశ్మీర్‌ సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందని ప్రశ్నించిన పాక్‌ జర్నలిస్ట్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. భారత్‌ నుంచి దొంగిలించిన కశ్మీర్ భూభాగాన్ని తిరిగి ఇచ్చినప్పుడే ఈ సమస్యకు తుది పరిష్కారం లభిస్తుందన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు తరువాత జమ్ముకశ్మీర్‌ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు జైశంకర్‌. అంతేకాకుండా అక్కడ అసెంబ్లీ ఎన్నికలను కూడా విజయవంతంగా ముగించినట్టు చెప్పారు. కశ్మీర్‌ ప్రజలకు ఆర్ధికాభివృద్ది, సామాజిక న్యాయాన్ని అందించినట్టు ప్రకటించారు. జైశంకర్‌ పర్యటన సందర్భంగా లండన్‌లో ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు మళ్లీ రెచ్చిపోయారు. జైశంకర్‌ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించారు. జైశంకర్‌ కారు ముందు భారత త్రివర్ణ పతాకాన్ని అవమానించారు. ఈ ఘటనపై విదేశాంగశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది . భద్రతా లోపాలు బయటపడ్డాయిని , అరాచకశక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసంది.

లండన్‌ లోని ఛాఠమ్‌ హౌస్‌లో అధికారిక సమావేశాలు ముగించుకున్న జైశంకర్‌ బయటకు వచ్చారు. అదే సమయంలో ఖలిస్థానీ వాదులు అక్కడ ఆందోళన చేపట్టారు. ఖలిస్తాన్‌ జెండాలతో నిరసన తెలిపారు. ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్‌ పోలీసులు వెంటనే అతడిని పట్టుకున్నారు. ఖలిస్తాన్‌ అనుకూల వాదులను లండన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బ్రిటన్‌ విదేశాంగశాఖ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. శాంతియుత నిరసనలకు మాత్రమే తమ దేశం అనుమతిస్తుందని , హింసకు పాల్పడితే సహించేది లేదని ఖలిస్తాన్‌ వాదులను బ్రిటన్‌ ప్రభుత్వం హెచ్చరించింది.