Double Murder Case: తనకు ఓటేయలేదని పోలింగ్ రోజునే ఇద్దర్ని ఏసేసిన మాజీ ఎంపీ.. జీవిత ఖైదు విధించిన సుప్రీం కోర్టు
దాదాపు 28 ఏళ్ల క్రితం (1995) జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత, మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 1) తీర్పు వెలువరించింది. 1995లో తనకు ఓటు వేయనందుకు ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపిన కేసులో ప్రభునాథ్ సింగ్ దోషిగా అత్యున్నత ధర్మాసనం తేల్చింది. ఈ కేసులో గతంలో..

పట్నా, సెప్టెంబర్ 1: దాదాపు 28 ఏళ్ల క్రితం (1995) జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత, మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 1) తీర్పు వెలువరించింది. 1995లో తనకు ఓటు వేయనందుకు ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపిన కేసులో ప్రభునాథ్ సింగ్ దోషిగా అత్యున్నత ధర్మాసనం తేల్చింది. ఈ కేసులో గతంలో హైకోర్టు ఆయన్ని నిర్దోషిగా ఇచ్చిన తీర్పును కొట్టివేసిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దేశ నేర న్యాయ వ్యవస్థలోనే ఇది అత్యంత బాధాకరమైన సంఘటన తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
జస్టిస్‌లు సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఐపీసీలోని సెక్షన్ 302, 307 కింద ఆగస్టు 18న సింగ్‌ను దోషిగా నిర్ధారించింది. శిక్ష విధింపుపై వాదనలు విన్న ధర్మాసనం దోషికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని బీహార్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
అసలు ఎవరీ ప్రభునాథ్ సింగ్..? ఏంటీ కేసు..?
ఆర్జేడీ నేత అయిన ప్రభునాథ్ సింగ్ 12వ, 13వ, 14వ లోక్‌సభకు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1985 నుంచి 1995 వరకు మస్రఖ్ అసెంబ్లీ నియోజకవర్గానికి, 1998 నుంచి 2009 వరకు బీహార్‌లోని మహారాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2013లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచి 2014 వరకు పార్లమెంటు సభ్యునిగా కొనసాగారు. ఇదీ ఆయన రాజకీయ ప్రస్థానం.




ఇక కేసు విషయానికొస్తే.. 1995 మార్చిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ తరపున బరిలోకి దిగిన సింగ్ పోలింగ్ రోజున బీహార్‌లోని సరన్ జిల్లాలోని చప్రాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున తనకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ జంట హత్యల కేసులో 2008 డిసెంబర్‌లో ట్రయల్ కోర్టు, 2012లో పట్నా హైకోర్టు సింగ్ నిర్దోషిగా తీర్పునిచ్చాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రభునాథ్ సింగ్‌ను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.