వ్యాక్సిన్ కోసం రేపు సెంటర్ల వద్ద ఎగబడకండి, ప్రజలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచన
వ్యాక్సిన్ కోసం రేపు సెంటర్ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడరాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. టీకామందు ఎప్పుడు వచ్చేదీ తెలియజేస్తామని,...
వ్యాక్సిన్ కోసం రేపు సెంటర్ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడరాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. టీకామందు ఎప్పుడు వచ్చేదీ తెలియజేస్తామని, అప్పుడు రావాలని ఆయన అన్నారు. దయచేసి వ్యాక్సిన్ కేంద్రాల వద్ద చాంతాండంత క్యూలు కట్టకండి.. నగరానికి వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది.. అసలు రాష్ట్రానికే పూర్తి స్థాయిలో ఇంకా టీకామందు రాలేదు అని ఆయన శుక్రవారం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారని, కానీ తమకు స్టాక్ అందని కారణంగా శనివారం నుంచి దీన్ని ఇవ్వజాలమని ఆయన స్పష్టం చేశారు. రెగ్యులర్ గా వ్యాక్సిన్ కంపెనీలతో తాము టచ్ లో ఉంటున్నామని ఆయన తెలిపారు. ఆదివారం నాటికి రాష్ట్రానికి 3 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందాల్సి ఉందన్నారు. సీరం సంస్థ, భారత్ బయోటెక్ కంపెనీ రెండూ 67 లక్షల డోసులు ఇస్తాయని కేజ్రీవాల్ వెల్లడించారు. 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి రేపటి నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలన్నది కేంద్రం ధ్యేయం. కానీ పలు రాష్ట్రాలు తమవద్ద టీకామందు లేదని ప్రకటిస్తున్నాయి. అసలు ఎప్పుడు వస్తుందో తెలియదని కూడా పేర్కొంటున్నాయి. ఫలితంగా శనివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. 45 ఏళ్ళు పైబడినవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, కానీ 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారు వేచిఉండాలని కేంద్రం చెబుతోంది.
ఇలా ఉండగా 18 ఏళ్ళు పైబడినవారికి మూడు నెలల్లోగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ఓ ప్లాన్ రూపొందించిందని కేజ్రీవాల్ తెలిపారు. ఇందుకోసం ఢిల్లీలో భారీ వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతివారూ టీకామందు తీసుకోవాలని ఆయన కోరారు. అటు పంజాబ్ , తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు కూడా వ్యాక్సిన్ కోసం వేచి చూస్తున్నాయి. ఓ వైపు కోవిడ్ కేసులు పెరగడం , మరోవైపు వ్యాక్సిన్ కొరత ఈ రాష్ట్రాలను వేధిస్తున్నాయి.